ఇన్సూరెన్స్‌ కోసమే నిప్పు | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌ కోసమే నిప్పు

Published Wed, Apr 17 2019 12:55 PM

TDP Leader Godown Fire Accident Drama Reveals - Sakshi

లింగాల : లింగాల మండలం దొండ్లవాగు గ్రామ సమీపంలోని డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌హౌస్‌లో సోమవారంతెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు గోడౌన్‌లో మంటలు ఎలా చెలరేగాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. పెద్ద ఎత్తున పంట ఉత్పత్తులున్న గోడౌన్‌లో..తెల్లవారే చల్లని సమయంలో మంటలు రేగడం....అక్కడ పెట్రోలుకు సంబంధించిన కవర్లు దొరకడంతో అగ్నిపై చర్చ రాజుకుంటోంది. అందునా అ«ధికారపార్టీ నాయకులు కావడంతో తిమ్మిని బమ్మి చేస్తూ...కనీస నిబంధనలు పాటించకుండా ముందుకు సాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ గోడౌన్‌లో వ్యవసాయ ఉత్పత్తులను దాచుకున్న రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. మిమ్మల్ని నమ్మి గోడౌన్‌లో పంట ఉత్పత్తులను దాచుకుంటే ఇలా నాశనం చేస్తారా? అంటూ రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. డీఎస్‌ఆర్‌ గోదాములో పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారులు, శనగలు, ధనియాలు, జొన్నలు, కందులు, పొద్దుతిరుగుడు విత్తనాలను నిల్వ ఉంచుకున్నారు. వీటిని చూపించి వేర్‌ హౌస్‌ నిర్వాహకులు, టీడీపీ నాయకుడు దేవిరెడ్డి సంజీవరెడ్డి పులివెందులలోని వివిధ బ్యాంక్‌ల్లో రుణాలు పొందినట్లు తెలియవచ్చింది. ప్రమాదవశాత్తు వేర్‌ హౌస్‌కు నిప్పు అంటుకుని గోదాములోని నిల్వలు తగలబడిపోయాయని సాకుగా చూపించి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చన్న పథకానికి వ్యూహరచన సాగించారని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు.

డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. : గోదాము నిర్వాహకులు ‘అనుకున్నదొకటి.. అయిందొక్కటి’అన్న చందంగా మారిందని పులివెందుల నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. గోదాములో నిల్వ ఉన్న ధనియాలకు మాత్రమే అధికంగా శనగలకు పాక్షికంగా నష్టం సంభవించిందని చర్చించుకుంటున్నారు. అగ్ని ప్రమాదమే సాకుగా చూపి ఇన్సూరెన్స్‌ పొందాలన్న గోదాము నిర్వాహకులు అంచనాలు తలకిందులయ్యాయని రైతులు అంటున్నారు. కేవలం ఇన్‌స్రూ?న్స్‌ కోసమే ఉత్పత్తులను అగ్నికి ఆహుతి చేసే ఎత్తుగడ సాగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

నిబంధనలకు నీళ్లు.. : గోదాములో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలకు సంబంధించిన సాంకేతిక పరికరాలు అందుబాటులేవు. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గోదాము ఉంటేనే అధికారులు అనుమతులు ఇవ్వాలి కానీ వాటికి ఆ శాఖ అధికారులు నీళ్లు వదిలారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు మంటలను ఆర్పివేయడానికి ఉండాల్సిన పరికరాలు కన్పించకపోవడం ఆందో ళన కలిగిస్తోంది. అధికార పార్టీ నాయకుడికి సంబం ధించిన గోదాము కావడంతో అధికారులు చూసీ చూ డనట్లు వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గోదాము లోపల అగ్ని ప్రమాధం అసలు ఎలా జరిగిందనే విషయం అంతుచిక్కని రహస్యంగా మారింది. బయటి వ్యక్తులు ఎవరు కూడా లోపలి వెళ్లే అవకాశం ఉండదు. లోపలికి నిప్పు ఎలా వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులకు సర్దిచెప్పిన గోదాము నిర్వాహకులు  
డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో సరుకులు నిల్వ చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం గోదాము నిర్వాహకులు దేవిరెడ్డి సంజీవరెడ్డి ఇక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే రైతులు మాత్రం సరుకుల విషయంలో న్యాయం కో రుతూ నిర్వహకుడితో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఆందోళనలో బ్యాంక్‌ అధికారులు
గోదాము నిర్వాహకుడు సంజీవరెడ్డి గోడౌన్‌లో ఉన్న రైతుల సరుకులపై కెనరా బ్యాంక్‌లో రూ.8కోట్ల మేర రుణాలు తన బంధువుల పేరిట పొందారు. ఆంధ్రా బ్యాంక్‌లో దాదాపు 50మంది రైతుల పేరుతో రూ.7.30కోట్ల మేర, గోదాము బిల్డింగ్‌ నిర్మించే సమయంలో రూ.9కోట్లు రుణం పొందినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఆయా బ్యాంక్‌ల ఉన్నతాధికారులు గోదాము వద్దకు చేరుకుని పరిశీలించారు. బుధవారం బ్యాంక్‌ల్లో సరుకు చూపి రుణాలు పొందిన వాటిని పరిశీలించే అవకాశం ఉంది. రుణం పొందిన సరుకు గోదాములో ఉందా.. లేదా నిర్ధారించుకునే అవకాశం ఉంది.

మంగళవారం డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌హౌస్‌ను ప్రొద్దుటూరుకు చెందిన యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ అధికారులు పరిశీలించారు. ఐదేళ్ల నుంచి నిర్వాహకులు రూ.20కోట్ల మేర గోడౌన్‌లోని సరుకుపై ఇన్సూరెన్స్‌ ప్రీమి యం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగినా.. అగ్ని ప్రమాదం సంభవించినా ఇన్సూరెన్స్‌ వర్తించేలా ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే  గోదాము నిర్వాహకుడు అగ్ని ప్రమాదాన్ని సృష్టించినట్లు సమాచారం. ప్రమాదవశాత్తు జరిగినట్లు  పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

విచారణ చేస్తున్న పోలీసులు : గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ధాన్యం బస్తాలపై ఉన్న పెట్రోలు కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ.. వాటిని సీజ్‌ చేయలేదని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దాదాపు 1500మంది రైతులకు సంబంధించిన పంట ఉత్పత్తుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారే కానీ.. ప్రాథమికంగా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టలేదు.మంగళవారం గోదాము వద్ద ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఇతర టీడీపీ నాయకులు చేరుకుని సమాలోచనలు చేశారు.

పరిశీలించి నివేదిక సమర్పిస్తాం
 లింగాల మండలం దొండ్లవాగు సమీపంలో ఉన్న డీఎస్‌ఆర్‌ వేర్‌హౌస్‌ గోడౌన్‌కు సంబంధించి నిబంధనల అతిక్రమణ విషయంలో వారికి నోటీసులు ఇచ్చి వివరాలు సేకరిస్తామని జిల్లా అగ్నిమాపశాఖ అధికారి భూపాల్‌రెడ్డి తెలియజేశారు. వేర్‌ హౌస్‌ వద్ద వాటర్‌తోపాటు ఇతర వసతులు ఉండాలని తెలియజేశారు. కానీ సంపు కూడా లేదని తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి అగ్నిమాపకశాఖ డీజీకి పంపుతామని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు కూడాగోడౌన్‌లో ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ  జరుపుతున్నారని ఆయన వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement