నిప్పు..నిజమెంత!

Fire Accident in TDP Leader Godown - Sakshi

టీడీపీ నాయకుని గోదాములో అగ్ని ప్రమాదం

రైతుల ధాన్యం బుగ్గిపాలు

గోదాము నిర్వాహకులపై రైతుల ఆరోపణలు

క్లూస్‌టీం పరిశీలన

మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

విచారిస్తున్న పోలీసులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, లింగాల : లింగాల మండలం దొండ్లవాగు గ్రామ సమీపంలో టీడీపీ నాయకుడు దేవిరెడ్డి సంజీవరెడ్డికి చెందిన డీఎస్‌ఆర్‌  గోదాము (వేర్‌హౌస్‌)లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది.గోదాములో  నిల్వ ఉన్న దాన్యం బుగ్గిపాలైంది. దీంతో బక్కచిక్కిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు   ధరలు వచ్చిన తర్వాత అమ్ముకుందామని గోదాములో నిల్వ ఉంచుకున్నారు. అయితే టీడీపీ జిల్లా సమన్వయకర్త దేవిరెడ్డి సంజీవరెడ్డికి చెందిన డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌ హౌస్‌ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ గోదాములో నిల్వ సామర్థ్యం 92వేల క్వింటాళ్లు కాగా.. ప్రమాదం జరిగిన సమయానికి 72వేల టన్నుల బుడ్డశనగలు, ధనియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, కందులు నిల్వ ఉన్నాయి. వీటిని నిల్వ చేసేందుకు రెండు భారీ గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాము నాలుగు గదులుగా విభజించారు. ఒకేసారి 8విభాగాల్లో మంటలు చెలరేగడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షార్ట్‌ సర్క్యూట్‌ లేకుండా 8 గదుల్లో ఎలా నిప్పు అంటుకుంటుందని ధాన్యాన్ని నిల్వ చేసుకున్న రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  

రూ. 3 కోట్ల మేర నష్టం?
గోదాములలో సుమారు రూ. 30 కోట్ల విలువ చేసే ధాన్యం బస్తాలు ఉన్నట్లు రైతులు, వ్యాపారులు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ. 3 కోట్లు మేర నష్టం జరిగి ఉండవచ్చని రైతులు చెబుతున్నారు.

ధాన్యం బస్తాల నెట్లపై పెట్రోలు ప్యాకెట్లు..
డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌హౌస్‌లో ధాన్యం బస్తాల నెట్లపై పెట్రోలుతో నింపిన ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిచ్చాయి. ఈ కవర్లు నిర్వాహకులే వేసి నిప్పు ఏమైనా అంటించారా?  ప్యాకెట్లు బయటి నుంచితీసుకువచ్చి ఎవరితోనైనా బస్తాలపై వేయమని పురికొల్పారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  పెట్రోలు కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పెట్రోలు కవర్లా? కాదా ? అన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోలు కవర్లు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపు
డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే  మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైరింజన్లు వచ్చా యి. పులివెందుల, కమలాపురం, కదిరి, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

నిబంధనలు శూన్యం
గోదాము నిర్మించాలంటే కనీస నిబంధనలు అవసరం. అయితే డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌ హౌస్‌లో నిబంధనలను గాలికి వదిలేశారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలను అదుపు చేయడానికి కార్బన్‌ డైయాక్సైడ్‌ సిలిండర్లు, నీటిని నిల్వ చేసే భారీ సంప్, బోరుబావి, విద్యుత్‌ మోటార్లు, ప్రతి గదికి సంప్‌ నుంచి వాటర్‌ పైపులైన్లు ఏర్పాటు చేయాలి. కార్బన్‌ డైయాకైడ్స్‌ సిలిండర్లు అలంకార ప్రాయంగా  గోడలకు తగిలించారే కానీ.. వాటిని వినియోగించే వారు లేరు, మంటలను అదుపు చేయడానికి వచ్చిన ఫైరింజన్లు రైతుల పొలాలకు వెళ్లి నీరు నింపుకుని రావాల్సిన దుస్థితి  ఏర్పడింది.

గోదాములో మంటలు.. : గోదాములోని ధాన్యం బస్తాలకు నిప్పు అంటుకున్నట్లు లింగాల ఎస్‌ఐ అమర్‌నాథరెడ్డి తెలిపారు.అయితే బస్తాల నెట్లపై పెట్రోలుతో నింపిన ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నాయి. వాటిని సేకరించాం. ఎంతకీ మంటలు అదుపు కాకపోవడంతో గోదాము గోడలను పగులగొట్టి  అదుపు చేయించాయాల్సి వచ్చిందని ఎస్‌ఐ  తెలిపారు. అదేవిధంగా గోదాములో ధాన్యాన్ని నిల్వ చేసిన వివరాల రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదంతో భారీ నష్టం సంభవించిందని అన్నారు.

గోదామును పరిశీలించిన క్లూస్‌ టీం.. :విషయం తెలుసుకున్న కడప క్లూస్‌ టీం ఎస్‌ఐ రుక్మిణి, సిబ్బంది అక్కడికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు.
గోదామును సందర్శించిన టీడీపీ నాయకులు : డీఎస్‌ఆర్‌ రూరల్‌ ఫార్మర్స్‌ వేర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులివెందుల టీడీపీ నాయకులు సతీష్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి బాధిత రైతులను ఆదుకుంటామన్నారు. అయితే గోదాము నిర్వాహకుడు దేవిరెడ్డి సంజీవరెడ్డి అందుబాటులో లేరు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నందున ఇక్కడికి  చేరుకోలేకపోయారని గోదాము సిబ్బంది తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. :
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ నాగారాజా, రూరల్‌ సీఐ రామకృష్ణుడులతోపాటు వేముల, పులివెందుల, లింగాల ఎస్‌ఐలతోపాటు ఆయా స్టేషన్ల సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

రైతుల సొమ్ము చూపించి బ్యాంక్‌లలో రుణాలు
గోదాములో నిల్వ ఉన్న రైతుల సరుకులు చూపించి రూ.13కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించారు.  గోదాము నిర్వాహకుడు సంజీవరెడ్డి రైతుల సరుకుపై వివిధ బ్యాంక్‌లలో తన బంధువుల పేరిట రూ.13కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్‌లో రూ.8కోట్లు, ఆంధ్రా బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లలో రూ.5కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కెనరా బ్యాంక్‌ గతంలోనే పత్రికా ప్రకటన ద్వారా గోదాములోని సరుకును వేలం వేసేందుకు బ్యాంక్‌ సిబ్బంది సిద్ధమయ్యారు. అయితే అప్పట్లో బ్యాంక్‌ అధికారులతో చర్చించి రాజకీయ పలుకుబడి ద్వారా మరింత గడువును పొడిగించుకున్నారు.   ఈ గోదాముకు సంబంధించి మార్కెట్‌ యార్డులో రెన్యువల్‌ చేయించుకోలేదని మార్కెట్‌ యార్డు అధికారులు వెల్లడించారు.

ఇన్సూరెన్స్‌ కోసమే అగ్ని ప్రమాదం సృష్టి
గోదాములోని సరుకును చూపించి అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని సృష్టించి తద్వారా ఇన్సూరెన్స్‌ పొందాలన్న ధ్యేయంతోనే  ప్రమాదం సృష్టించినట్లు రైతులు, వ్యాపారులు   ఆవేదనను వెల్లగక్కుతున్నారు. గోదాములోని దాదాపు సగం సరుకు మేర గత వారం రోజులనుంచి పక్కదారి పట్టించి గోదాము నిర్వాహకులు సంజీవరెడ్డి అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  

విలాసాలే కారణమా..   
సోమవారం డీఎస్‌ఆర్‌ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదానికి గోదాము నిర్వాహకుడు సంజీవరెడ్డి విలాసాలే కారణమని తెలుస్తోంది.  రైతుల సరుకును పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుని ఆ డబ్బుతో విలాసాలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరులోని క్లబ్‌లలో  జూదమాడినట్లు సమాచారం. బెంగళూరులోని అధికార పార్టీ నాయకుడికి చెందిన క్లబ్‌లో సంజీవరెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రి, ఇతర నేతలు  జూదమాడేవారని తెలుస్తోంది. ఈ క్లబ్‌లకు సంజీవరెడ్డి నిత్యం వెళ్లేవారని... విమానాలలో తిరుగుతూ.. జూదమాడుతూ రైతుల సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. ఇటీవల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు పర్యటనలో గోదాములలో ఉన్న శనగలను అధికారంలోకి రాగానే క్వింటాకు రూ.6వేల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించడం జరిగింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించాలని భావించిన తరుణంలో  అగ్ని ప్రమాద డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.

గోదాము నిర్వాహకులే నిప్పు పెట్టారు
గోదాము నిర్వాహకులే ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు.     వారం రోజులుగా రాత్రిపూట సిబ్బంది ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మిగిలిన రైతులకు సంబంధించిన ధాన్యానికి నిప్పు పెట్టారు. మరికొంతమంది రైతుల ధాన్యం నిల్వ చేసిన చోట లేవు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నాకు సంబంధించిన 3వేల బస్తాల ధనియాలు కాలిపోయాయి. అనామత్తు ధరలతో రైతులనుంచి కొనుగోలు చేసి గోదాములో నిల్వ చేసుకున్నారు. రెండేళ్లుగా ధరలు లేక వాటిని నిల్వ చేసుకున్నారు. ధనియాలు కాలిపోయి, తడిసిపోయి ఎందుకు పనికిరాకుండాపోయాయి. దీం తో కోటి రూపాయల దాకా నష్టం వాటిల్లిం ది. ఈ నష్టాన్ని గోదాము నిర్వాహకులే చెల్లించాలి.      – రామాంజనేయరెడ్డి(వ్యాపారి), దొండ్లవాగు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top