బాబు సర్కారులో అన్నీ భారాలే..!

TDP Government Increased Tax Rates - Sakshi

ప్రజలపై పన్నుబాదుడు

ఐదేళ్లూ ఇదే తీరు..

రక్తం పీల్చిన టీడీపీ సర్కారు

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర బాగుపడాలంటే తానే దిక్కంటూ.. అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రజలను వంచించింది. ఐదేళ్లూ ‘పన్ను’ గాట్లతో సామాన్యుల రక్తం జలగలా పీల్చింది. జేబులు కొల్లగొట్టింది. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలతోపాటు.. ఆస్తి, ఇతర పన్నులను భారీగా పెంచేసింది. పేద, మధ్యతరగతివర్గాల వారిపై మోయలేని భారం మోపి వారి నడ్డివిరిచింది.

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): విద్యుత్‌ వినియోగదారులపై 2016లో చార్జీల భారం మోపారు. ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో కేటగిరీ బీ–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులు 73,039 ఉండగా వాటి ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగమవుతోంది. దీని నిమిత్తం నెలకు సుమారు రూ.12.39 కోట్లను ఆయా వాణిజ్య వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఈ కేటగిరీపై యూనిట్‌కు 18 పైసలు భారం వేయడంతో నెలకు సుమారు రూ.24 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అలాగే జిల్లాలోని 4,331 పరిశ్రమలు ఇప్పటి వరకూ ప్రతినెలా సుమారు 1.19 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినయోగిస్తూ సుమారు రూ.8.23 కోట్ల మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు.

విద్యుత్‌ చార్జీల మోత
పరిశ్రమల విద్యుత్‌ వినియోగంపై యూనిట్‌కు 13 పైసలు పెంచడంతో వారిపై సుమారు రూ.15.47 లక్షల రూపాయలు నెలకు అదనంగా భారం పడింది. ఇదిలా ఉండగా విద్యుత్‌ చార్జీల పెంపు విషయంలో పంచాయతీలను, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ప్రజలకు అత్యవసరమైన వీధిలైట్ల వినియోగం, నీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌పై సైతం పెంపుదల భారం పడింది.  వాటిపైనా యూనిట్‌కు 11 నుంచి 13 పైసలు పెంచారు. దీంతో అప్పటికే సుమారు  రూ.142 కోట్ల విద్యుత్‌ బిల్లులు  తూర్పుప్రాంత విద్యుత్‌ సంస్థకు బకాయిపడ్డ పంచాయితీలు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే అంశంలో పునరాలోచనలో పడ్డాయి. వీటితోపాటు విద్యా వ్యవస్థను కూడా చంద్రబాబు ఉపేక్షించలేదు. ప్రభుత్వ రంగ హాస్టళ్లు, పాఠశాలలపైనా యూనిట్‌కు 14 పైసలు చొప్పున భారం వేశారు. మొత్తంగా వివిధ కేటగిరీల్లో పెంచిన విద్యుత్‌ చార్జీల ప్రభావం జిల్లా వాసులపై నెలకు రూ.కోటి, ఏడాదికి రూ.12కోట్లు పడింది.

జిల్లా ప్రజలపై ఏటా అదనపు భారం ఇలా.. రూ.కోట్లలో
విద్యుత్‌ చార్జీలు -12 కోట్లు
ఇంటిపన్ను- 33 కోట్లు
ఆర్టీసీ వడ్దన - 33.60 కోట్లు

ఆర్టీసీ చార్జీలు ఇలా.. 
ఇక సామాన్య ప్రజల రవాణా అవసరాలు తీర్చే ఆర్టీసీపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు.  అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే  2015లో ఆర్టీసీ ప్రయాణ టిక్కెట్‌ ధరలను అమాంతం పెంచేసింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు (ప్యాసింజర్‌) బస్సుల టిక్కెట్‌ ధర అప్పట్లో కిలో మీటరుకు 59  పైసలు ఉండగా దానిపై 5 శాతం ధర పెంచింది. అలాగే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల ధరలు కిలో మీటరుకు 79 పైసలుండగా దానిని 8 పైసలు పెంచి  87 చేయగా, డీలక్స్‌ బస్సులకు 89 పైసలుండగా 9 పైసలు పెంచి 98 పైసలు చేసింది. వీటితో పాటు సూపర్‌ లగ్జరీ బస్సులకు 105 పైసలుండగా 11 పైసలు పెంచి 116 పైసలు, ఇంద్ర బస్సులకు 132 పైసలుండగా 14 పైసలు పెంచి 146 పైసలు, గరుడ బస్సులకు 155 పైసలుండగా 16 పైసలు పెంచి 171 పైసలు, గరుడ ప్లస్‌ బస్సులకు 165 పైసలుండగా 17 పైసలు పెంచి 182 పైసలుగా నిర్ణయించి వసూలు చేయడం ప్రారంభించింది.

‘టోలూ’ వలిచింది
ఇదిలా ఉంటే.. టోల్‌ గేట్‌ చార్జీలు మినహాయిస్తే ఆర్టీసీ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నా.. ఆ చార్జీల బారాన్ని కూడా ప్రయాణికులపైనే మోపింది. బస్సు ప్రయాణికుడు ప్రతి టోల్‌గేట్‌పై అక్షరాలా రూ.ఏడు  చెల్లించాల్సి వస్తోదంటే ప్రభుత్వం వారిపై ఏవిధంగా చీకటి దెబ్బలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అంటే  ఆర్టీసీ పశ్చిమ రీజియన్‌ పరిధిలో రోజుకు సుమారు 1.08 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారందరిపై ఈ భారంపడుతోంది.

‘సెస్సా’దియ్యా..
మరో విచిత్రం ఏమిటంటే సేఫ్టీ సెస్‌ పేరిట ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై అదనపు భారం వేసి జేబులు గుల్ల చేస్తోంది. ప్రతి ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్‌పై ఒక రూపాయిని సేఫ్టీ సెస్‌గా వసూలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చీకటి దోపిడీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

ఇంటి పన్నుపోటూ ఎక్కువే
పేదలకు నిలువ నీడ కోసం గృహాలు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, రెక్కల కష్టంతో తినీ తినకా రూపాయి, రూపాయి పోగుచేసుకుని ఇల్లు కట్టుకుంటే దానిపై పన్నుల రూపంలో భారీ దోపిడీకి తెర లేపింది. గత ఏడాది తాజాగా ఇంటిపన్నును అమాంతం 20 శాతం పెంచేసింది. దీంతో సామాన్యులు సతమతమవుతున్నారు. పల్లెల్లోనూ పన్నులు భారీగా పెరిగాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను డిమాండ్‌  గత ఏడాదికి  పూర్వం రూ.165 కోట్లు ఉండగా, గత ఏడాది నుంచి ఆ డిమాండ్‌ కాస్తా మరో రూ.33 కోట్లు పెరిగి  సుమారు రూ.198 కోట్లకు చేరుకుంది. ఏటా ఇది పెరిగే అవకాశం ఉంది.

అద్దెలూ పెరిగాయి..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు గృహాలు ఇస్తామని చెప్పడం తప్ప ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ నియోజకవర్గాల్లో కొన్ని ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం వాటిని కేవలం టీడీపీ వారికే  కేటాయించింది. దీంతో అర్హులు అద్దె ఇళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. ఇంటిపన్నులు పెరగడంతో యజమానులు అద్దెలూ పెంచేశారు.

సామాన్యులపై భారం సిగ్గు చేటు
ఇంటిపన్ను రూపంలో 20 శాతం పెంచడం దారుణం. సామాన్యులపై ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్న వారిపై పన్నుల భారం మోపడం సబబు కాదు.
– కడలి రామ్మోహనరావు, ఏలూరు

టీడీపీ పాలనలో నరకమే..
టీడీపీ అధికారంలోకి వస్తోందంటేనే సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో తొమ్మిదేళ్ళ పాలనలో నరకం చూపించిన ప్రభుత్వం అనంతరం 2014 నుంచి మరోసారి తన ప్రతాపం చూపుతోంది. ఈ ప్రభుత్వాన్ని భరించడం మా వల్ల కాదని ప్రజలు లబోదిబోమంటున్నారు.
– మువ్వల నాగేశ్వరరావు, ఏలూరు

అభివృద్ధి శూన్యం
టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదికే పన్నుల మదింపు తీసుకురావడంతో ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. ఏటా ఐదు శాతం చొప్పున పన్నును పెంచి వసూలు చేస్తున్నారు. భవనం, భూముల విలువను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ పన్నులు విధించడంతో పేదలు, సామాన్యులకు భారంగా మారింది. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా పంచాయతీ పన్నులతోపాటు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడుతున్నాయి.
–గెడ్డం రవీంద్రబాబు, మాజీ ఉపసర్పంచ్, సమిశ్రగూడెం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top