నర్సీపట్నంలో టీడీపీ ఎదురీత

Tdp Facing Problem Regarding Narsipatnam Constituency - Sakshi

 ప్రభుత్వంపై వ్యతిరేకతతో వైఎస్సార్‌పీపీకి  పెరుగుతున్న ఆదరణ 

సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.  మంత్రి అయ్యన్నపాత్రుడు అభివృద్ధి చేసినా అదేస్థాయిలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో జనం విసిగిపోయారు. అర్హులకు పథకాలు అందకుండా అడ్డుకున్నారు. అందినంత దోచుకున్నారు. దీంతోపాటు గతంలో ఎన్నడూలేని విధంగా మంత్రి కుటుంబంలో బయటపడిన కలహాల ప్రభావం ఎన్నికలపై చూపనుంది. ఈ పరిస్థితులన్నీ టీడీపీకి వ్యతిరేకం కాగా వైఎస్సార్‌సీపీకి అనుకూలించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

రచ్చకెక్కిన విభేదాలు
మంత్రి అయ్యన్నపాత్రుడు, సోదరుడు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి వీరు సఖ్యతగానే ఉండేవారు. ఇందుకు భిన్నంగా రెండేళ్ల నుంచి ఆ రెండు కుటుంబాల మ«ధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. మంత్రి తనయుడు విజయ్‌ వ్యవహార శైలిపై బాబాయ్‌ సన్యాసిపాత్రుడు స్వయంగా పార్టీ అధ్యక్షుడు,  సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల్లో చూపనుంది.

జన్మభూమి కమిటీలతో విసిగిన జనం
మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినప్పటికీ అదేస్థాయిలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినంత దోచుకున్నాయన్న విమర్శలున్నాయి. గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల రుణాలు, కాలనీ ఇళ్లు కేటాయింపులో జన్మభూమి కమిటీలు కమీషన్ల పేరుతో అవినీతికి పాల్ప డ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  కమిటీ సభ్యుల చేతివాటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

రెండింటి మధ్యే పోటీ
ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉన్నప్పటికీ జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే జనసేన, కాంగ్రెస్‌ నుంచి పోటీచేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత లేదు. 

ఆకర్షిస్తున్న నవరత్నాలు 
గత ఎన్నికల్లో చంద్రబాబు భారీ స్థాయిలో హామీలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల రుణ మాఫీ కానందున అప్పులు పాలయ్యారు. ఈ విషయంలో వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది.  రైతు రుణ మాఫీ విషయంలో సైతం ఇంకా చివరి రెండు విడతల నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వారంతా కూడా టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇలా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు విసిగెత్తిపోయారు.

ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప«థకాలతో అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు తక్కువ మెజారిటీతో గెలుపొందారు. అప్పటికన్నా గ్రామస్థాయిలో వైఎస్సార్‌సీపీ మరింత బలపడింది. ఇవన్నీ టీడీపీ ఎదురీతకు కారణం కానున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top