టీడీపీలో ఫేస్‌బుక్‌ ఫైట్‌

TDP Facebook Fight At Amalapuram - Sakshi

సాక్షి, అమలాపురం టౌన్‌: సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు అమలాపురం పట్టణ టీడీపీలో చెలరేగిన వివాదం నేటికీ రగులుతూనే ఉంది. మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం పదవిపై జరిగిన జెంటల్మన్‌ ఒప్పందం అమలు పట్టణ పార్టీలో వర్గ విభేదాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యాక నియోజకర్గంలో ముఖ్యంగా పట్టణంలో టీడీపీ చుక్కాని లేని పడవలా ఊగిసలాడుతోంది. నడిపించే నాయకుడు లేక తలో దారి అన్నట్టుగా మారింది. జెంటిల్మన్‌ ఒప్పందం అమలు తర్వాత పట్టణంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఇరు పక్షాలు మాటల తూటాలను పేల్చుతున్నారు. అది ఎంత వరకు వెళ్లిందంటే ఫేస్‌బుక్‌ ఫైట్‌ వరకూ వెళ్లింది.

కొందరు సమర్థిస్తూ.. మరికొందరు వ్యతిరేకిస్తూ..
పార్టీలో ఓ వర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి దాదాపు రూ.ఐదు కోట్లతో నిర్మించిన చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం, డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు ఆరోగ్య ఉద్యానవనాల పనుల్లో దాదాపు రూ.మూడు కోట్ల మేర అవినీతి (స్కామ్‌) జరిగిందని, అదే పార్టీకి చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ దున్నాల దుర్గ ఏకంగా తన ఫేస్‌బుక్‌లో ఆరోపణలు గుప్పిస్తూ తాను దీనిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఫేస్‌బుక్‌ ఆరోపణలను స్పందిస్తూ అదే పార్టీకి చెందిన కొందరు సమర్థిస్తూ... మరికొందరు వ్యతిరేకిస్తూ పలు రకాల కామెంట్లు ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గ ప్రజల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో ఈ ఫేస్‌బుక్‌ ఫైట్‌పై ఆసక్తికరంగా మారింది. ఆ రెండు పార్కుల్లో ఎర్త్‌ వర్కుల నుంచి పార్కుల మొక్కలు, ప్రతిమలు కొనుగోళ్ల వరకూ ఇలా ప్రతి అంశంలోనూ అవినీతి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలు వింటున్న.. ఫేస్‌బుక్‌ల్లో చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ విషయంలో ఎందుకో మౌనంగానే ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సైతం నియోజకవర్గ పార్టీపరమైన అంశాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యే మార్గంగా పట్టణ టీడీపీకి దిక్సూచిలా ఉండే పార్టీ నేత మెట్ల రమణబాబు కూడా ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉండడంతో ముఖ్యంగా పట్టణంలో పార్టీ సొంత కేడర్‌పై పట్టు కోల్పోతున్నట్టవుతోంది. ఆ రెండు పార్కుల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. అప్పట్లో కొందరు టీడీపీ నేతలు మున్సిపల్‌ పదవులను అడ్డుపెట్టుకుని ఈ పార్కుల్లో అధిక ధరలతో అంచనాలు, కొనుగోళ్లలో మాయాజాలం, ఎర్త్‌ వర్కుల్లో ఇంజినీరింగ్‌ ఎంబుక్‌ల రికార్డులు, పొక్లెయిన్ల అద్దెల్లో అవకతవకలు ఇలా పలు అంశాలపై ‘సాక్షి’ కథనాల్లో ప్రస్తావించిన విషయాలు విదితమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top