ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్ల స్థానంలో కొత్తవారికి గురువారం పోస్టింగ్‌లు ఖరారు చేశారు.
సాక్షి, నల్లగొండ: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్ల స్థానంలో కొత్తవారికి గురువారం పోస్టింగ్‌లు ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీన 48మంది తహసీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. వాస్తవంగా మరుసటి రోజే కొత్తవారికి పోస్టింగ్‌లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే జిల్లాకు మొదటగా 43మంది తహసీల్దార్లనే కేటాయించారు. దీంతో వారికి మండలాలను కేటాయించడంలో ఒకరోజు ఆలస్యమైంది. మిగిలిన ఐదుగురిని కూడా జిల్లాకు అలాట్ చేయడంతో తహసీల్దారులందరికీ పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ టి. చిరంజీవులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబ్‌నగర్ నుంచి 25 మంది, మెదక్ 9 మంది, నిజామాబాద్ నుంచి ఆరుగురు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున జిల్లాలో పోస్టింగ్‌లు పొందారు. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న నలుగురికి ఇతర మండలంలో పోస్టింగ్ ఖరారు. వీరు సొంత జిల్లాకు చెందినవారు కాకపోవడంతో పాటు ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తికాలేదు. వీరికి జిల్లాలోనే ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు.