శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర 

Swaroopanandendra Saraswati declares Swatmanandendra swami as Sharada peetham Uttaradhikari - Sakshi

మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అధికారిక ప్రకటన

2024లో పీఠం పూర్తి బాధ్యతలు స్వాత్మానందేంద్రకే అని వెల్లడి

శారదా పీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ స్వీకార కార్యక్రమం పరిసమాప్తం

హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్‌ జగన్, కేసీఆర్‌

సాక్షి, విజయవాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని నియమిస్తున్నట్టు పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అధికారిక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా తీరంలో గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మూడు రోజులపాటు నిర్వహించిన శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం సోమవారంతో పరిసమాప్తమైంది. సుమారు 10గంటలకు పైగా పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. స్వాత్మానందేంద్రకు స్వామిజీ సమక్షంలో సన్యాసాంగ అష్ట్రశాద్ధ కర్మలను వేదోక్తంగా నిర్వహించారు. తొలుత రుత్వికులు వేద క్రతువును నిర్వహించారు. శారదా పీఠం వేదపండితులు కృష్ణశర్మ, కేశవ అవధాని వేదోక్తంగా క్రతువును నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కాషాయ వస్త్రాలు, దండకమండలాలను స్వాత్మానందేంద్రకు అందించి సన్యాసం ఇప్పించారు. అనంతరం శారదా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ సమక్షంలో బాలస్వామికి యోగపట్టా అనుగ్రహం చేశారు. ఈ సందర్భంగా మహాస్వామికి, ఉత్తరాధికారికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండ్లు, వస్త్రాలు బహూకరించారు. మహాస్వామికి కుడివైపున ఉత్తరాధికారి ఆశీనులవగా ఎడమ వైపు రెండు కుర్చీలలో ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ కూర్చున్నారు. సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేసిన తరువాత తన ఆసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలకు మహాస్వామి సాష్టాంగ నమస్కారం చేసి హారతి ఇచ్చారు. మహాస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతి వేదమంత్రాల మధ్య పుష్పాభిషేకం చేశారు. దేవదాయశాఖ కమిషనర్‌ ఎం.పద్మ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలను మహాస్వామికి అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లను మహాస్వామి సత్కరించి ప్రసాదాలు అందజేశారు. 

తర్క, మీమాంస, వ్యాకరణ, ఉపనిషత్తుల్లో ఉత్తరాధికారి నిష్ణాతుడు
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ.. నా తొడపైనే పెరిగి, నా వద్ద చదువుకుని తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాత్రింబవళ్లు విని, కాశ్మీర్‌ నుంచి లఢక్‌ వరకు పాదయాత్ర చేసి మంచు కురుస్తున్న వేళ కూడా తపస్సు చేసిన తపోనిధి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అని కొనియాడారు. 2024లో శారదా పీఠం పూర్తి బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించి తాను తపస్సులో నిమగ్నమవుతానని తెలిపారు. ఎండలు 46 డిగ్రీలతో మండిపోతున్న వేళ శారదా పీఠం ఉత్తరాధికారిని ప్రకటించే సమయంలో చినుకులు పడి చల్లటి వాతావరణం ఏర్పడటమంటే భగవంతుడి కృప పూర్తిగా ఉన్నట్టేనని పేర్కొన్నారు. తామిద్దరం అద్వైత స్వరూపులమేనని చెప్పారు. 

ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు దిగ్విజయంగా పాలించాలి
ధర్మం గెలుస్తుందని, అధర్మం ఓడిపోతుందని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల గెలుపే అందుకు ఉదాహరణ అని మహాస్వామి చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలవాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, హిందూ ఆలయాలు బాగుపడాలని, ధూపదీప నైవేద్యాలు బాగా జరగాలని కోరుకున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాబోయే 15 ఏళ్లు ఇద్దరు సీఎంలు వారి రాష్ట్రాలను దిగ్విజయంగా పరిపాలించాలని శారదా పీఠం తపస్సు చేస్తుందన్నారు. స్వాత్మానంద సరస్వతి స్వామీజీ అంటే వైఎస్‌ జగన్‌కు చాలా అభిమానమని చెప్పారు. 

కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు
స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ సన్యాసం తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు, తల్లి, కన్నీటి పర్యంతమయ్యారు. సన్యాసం తీసుకున్న వ్యక్తి భవబంధాలకు దూరంగా ఉండాల్సి రావటంతో వారి కన్నీటికి అంతులేకుండా పోయింది.  

5వ ఏటే పీఠానికి..
శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర అసలు పేరు కిరణ్‌కుమార్‌శర్మ. విశాఖ జిల్లా భీముని పట్నానికి చెందిన హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతుల జ్యేష్ట సంతానంగా 1993 ఏప్రిల్‌ 4న ఆయన జన్మించారు. ఆయనకు కిషోర్‌కుమార్‌ అనే సోదరుడు ఉన్నారు. తన 5వ ఏటనే శారదా పీఠానికి వెళ్లిన కిరణ్‌కుమార్‌శర్మ నాటినుంచీ మహాస్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతనే ఉన్నారు. పీఠంలోనే పెరిగారు. మహాస్వామికి ఆంతరంగిక శిష్యునిగా కొనసాగారు. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలును ఔపోసన పట్టారు.  

లోక కళ్యాణమే ధ్యేయం
స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ
లోక కళ్యాణమే ధ్యేయంగా శ్రీ శారదా పీఠం పనిచేస్తోందని అనుగ్రహ భాషణంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పండితులు, స్వామీజీలను సత్కరించారు. శ్రీశారదా పీఠం అభివృద్ధికి కృషి చేసిన సుబ్బిరామిరెడ్డిని స్వామీజీ సత్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top