విశాఖ పోలీసుల అదుపులో ఆశ్రమ స్వామీజీ!

విశాఖ పోలీసుల అదుపులో ఆశ్రమ స్వామీజీ!


విచారణకు విశాఖకు తరలింపు

బాలా త్రిపుర సుందరీదేవి

ఆలయంలో ఉద్రిక్తత

మహర్షి వెంట తరలివెళ్లిన శిష్యులు


 

పాడేరు రూరల్: పాడేరు మండలం వంతాడపల్లి చెక్‌పోస్టు సమీపంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆశ్రమ స్వామీజీని బుధవారం పోలీసులు విచారణ కోసం విశాఖకు తీసుకెళ్లారు. ఈ ఆశ్రమాన్ని మొదటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. 2011లో ఆశ్రమం నిర్మాణం కోసం అమెరికాకు చెందిన గోకరాజు వినీత, శ్రీధర్, విశాఖకు చెందిన పుండరీకాక్షుడు, సుహాసినీ, సుధ, మోహన్ దంపతులు సుమారు రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్మును సక్రమంగా ఖర్చు చేయలేదని, ఆశ్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని 2013లో దాతలు విశాఖపట్నం, పాడేరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.  దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి రెండు రోజుల క్రితం ఆశ్రమంలో స్వామీజీని విచారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా  బుధవారం సాయంత్రం స్పెషల్‌బ్రాంచి సీఐ పి.సూర్యనారాయణ ఆశ్రమానికి వచ్చి  విశాఖపట్నంలో ఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని స్వామీజీకి సమాచారం అందించారు. దీంతో స్వామీజీ పోలీసుల వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో విశాఖకు వెళ్లారు. ఆయన వెంట వారి శిష్యులు కూడా ట్రక్కులో విశాఖపట్నం వెళ్లారు.ఈ విషయంపై స్పెషల్ బ్రాంచి సీఐ సూర్యనారాయణను విలేకరులు వివరణ కోరగా స్వామీజీపై వచ్చిన అభియోగాల విచారణ నిమిత్తం విశాఖపట్నం ఎస్పీ వద్దకు తీసుకు వెళుతున్నామని తెలిపారు.



ఆరోపణలు అవాస్తవం:  దయానిధి

తనపై నమోదైన అభియోగాలు అవాస్తవమని ఆశ్రమ స్వామీజీ కీర్తి దయానిధి మహర్షి స్పష్టం చేశారు. ఆశ్రమంలో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో హిందూ మతం వినాశనానికి కొంత మంది దుష్టశక్తులు కంకణం కట్టుకున్నాయని, అందులో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో హిందూమతం పరిరక్షణకు, గిరిజనులను భక్తి, సన్మార్గంలో నడిపించేందుకే తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఆశ్రమ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆశ్రమం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన సొమ్మును తరువాత అప్పుగా ఇచ్చామని, వెంటనే తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తనపై వచ్చిన అభియోగాలు సరైనవి కావని నిరూపించుకునేందుకే విశాఖపట్నంకు వెళుతున్నానని, శిష్యులు అధైర్య పడవద్దన్నారు.  

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top