వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మృతి చెందిన చిన్నారి కేసు కొత్త మలుపు తీసుకుంది.
బద్వేల్ : వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మృతి చెందిన చిన్నారి కేసు కొత్త మలుపు తీసుకుంది. కన్నతండ్రే గొంతు పిసికి చంపాడంటూ స్థానికులు వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిపై చిన్నారి తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోరి రాజుగారి వీధికి చెందిన ఫయాజుద్దీన్ నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఇమామ్‌బీని 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి నయీముద్దీన్ (8) అనే కుమారుడు, అమ్రీన్ (7) అనే కుమార్తె ఉన్నారు. విభేదాలతో వీరు మూడు నెలల క్రితం విడిపోయారు. పిల్లలు ఇద్దరూ తండ్రి దగ్గర ఉండేట్లు ఒప్పందం కుదిరింది.
ఆ తర్వాత ఫయాజుద్దీన్ కమలాపురానికి చెందిన జకీరాను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 13న అమ్రీన్ మృతి చెందింది. అనారోగ్యంతో మృతి చెందిందని చెప్పి ఫయాజుద్దీన్ ఆమె అంత్యక్రియలు ముగించేశాడు. అయితే, చిన్నారి గొంతు భాగంలో తాడుతో నులిమినట్టు గుర్తులు కనిపించాయంటూ స్థానికులు ఈ విషయాన్ని ఆత్మకూరులో ఉంటున్న ఇమామ్‌బీకి తెలిపారు. దీంతో ఆమె తన కటుంబ సభ్యులతో కలసి మంగళవారం బద్వేల్ అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని తహశీల్దార్ సమక్షంలో వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో అసలు విషయం నిగ్గు తేలుస్తామని సీఐ రామాంజినాయక్ తెలిపారు.