
ఈవో ముందుచూపు
వేసవిలో అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని యాత్రికుల
వేసవిలో భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
సత్వర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు
వసతి గృహాల మరమ్మతులు చేపట్టండి
పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ
టీటీడీ అధికారులకు ఈవో సాంబశివరావు ఆదేశం
తిరుపతి కల్చరల్: వేసవిలో అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో (పీఏసీ) ఎలాంటి మరమ్మతులు లేకుండా చర్యలు చేపట్టాలని టీటీఈ ఈవో సాంబ శివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్‌లోని తన కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికుల వసతి సముదాయాల్లో లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే సత్వరం గుర్తించి మరమ్మతులు చేయాలని కోరారు.
ఇందు కోసం తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరావు అధ్యక్షతన చీఫ్ ఇంజినీర్, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ పెండింగ్ పనులను గుర్తించి నెలరోజుల్లోపు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భక్తుల భద్రత దృష్ట్యా అన్ని పీఏసీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల ఒకటి, రెండో ఘాట్ రోడ్లలో సమర్థవంతంగా పరిశుభ్రత పనులు చేపట్టాలని కోరారు. నడక దారుల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని ఆదేశించారు.
తిరుమల, తిరుపతిలోని ఐటీ సమస్యలను త్వరిగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఈవో ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ కల్యాణ మండపాల్లో సివిల్, ఎలక్ట్రికల్ వంటి మరమ్మతులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో సివిల్ పనులను వేగవంతం చేయాలన్నారు. పవన విద్యుత్, సౌర విద్యుత్‌ను టీటీడీ అవసరాలకు వినియోగించుకునేందుకు మరింత అధ్యయనం చేయాలని ఈవో సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.