చల్లని బీరు.. అమ్మకాల జోరు

Summer Effect Beer Sales Hikes in Visakhapatnam - Sakshi

ఎండల తీవ్రతతో పెరిగిన బీర్ల విక్రయాలు

గత ఏప్రిల్‌ కంటే 50 శాతం అధికం

సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి చెమటలు గక్కాల్సి వస్తోంది. దీంతో మందుబాబుల కళ్లన్నీ బీర్లపైనే పడుతున్నాయి. అందుకే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సహజంగా వేసవిలో చల్లని బీర్లకు డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి రెండో వారం నుంచే వేసవి తాపం మొదలయింది. ఏప్రిల్‌ నుంచి మరింత తీవ్రరూపం దాల్చింది. మే వచ్చే సరికి ఉష్ణతాపం అదుపు తప్పి జనాన్ని అల్లాడిస్తోంది. వేడి తీవ్రత నుంచి జనం శీతలపానీయాలు, పండ్ల, చెరుకు రసాలు, కొబ్బరిబొండాలు వంటివి సేవించి ఉపశమనం పొందుతున్నారు. కానీ మద్యం సేవించే అలవాటున్న వారు మాత్రం బీర్లను గటగటా తాగేస్తున్నారు.

మద్యం కంటే బీర్లపైనే ఆసక్తి
జిల్లావ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌లో 2,54,729 కేసుల బీరు బాటిళ్లు అమ్ముడయ్యాయి. అప్పట్లో ఈ అమ్మకాలకే ఎక్సైజ్‌ అధికారులు అచ్చెరువొందారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 3,91,005 బాటిళ్ల బీరును లాగించేశారు. అంటే గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే.. 53.50 శాతం అమ్మకాలు అధికమన్నమాట. ఏకధాటిగా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతుండడంతో మే నెలలో మరింతగా బీర్ల విక్రయాలు పెరుగుతాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వేసవి మొదలయినప్పట్నుంచి మద్యం కంటే (బ్రాందీ, విస్కీ వంటివి) బీర్ల అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయని లిక్కర్‌ వ్యాపారులు చెబుతున్నారు. మామూలు రోజుల్లో రోజుకు ఒక షాపులో 500 బీరు బాటిళ్లు అమ్మితే ఇప్పుడు 800 వరకు అమ్ముడవుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి అలవాటుపడ్డ వారు బీర్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తంమ్మీద ఉష్ణతాపంతో పాటే బీర్ల విక్రయాలూ రోజురోజుకూ ఊపందుకున్నాయి. కొన్ని సందర్భాల్లో మద్యం షాపుల డిమాండ్‌కు తగినట్టు బీర్లు సరఫరా చేయడం కూడా కష్టతరమవుతోందని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top