
ప్రగతి భవన్
ఒంగోలు టూటౌన్: ఎస్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం కోసం నెత్తుటి ధారతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారుడి వ్యవహారం స్థానిక ప్రగతి భవన్‌లో శుక్రవారం కలకలం రేపింది. కార్యాలయ మెట్లపై నుంచి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం లోపల వరకు రక్తం ధార పడటంతో ప్రగతి భవన్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందారు. స్థానిక గద్దలగుంటకు చెందిన ఎం.జమదగ్ని 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద రుణం మంజూరైంది. లబ్ధిదారుడు శుక్రవారం ఉదయం ఎస్సీ ఈడీ జయరామ్‌ను కలిశాడు. క్యాంపునకు వెళ్లి వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ పరిశీలించి రుణం చెక్ మంజూరు చేస్తామని ఆయన లబ్ధిదారుడితో చెప్పారు. తనకు తిరిగే ఓపిక లేదని, చెక్ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి లబ్ధిదారుడిని వారించినా వినిపించుకోలేదు. చేతికి ఉన్న సెలైన్ ప్యానల్‌కు మూత పెట్టుకోకుండా అడ్డం తిరుగుతున్నాడు. కానిస్టేబుల్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్ కూడా అతడిని గంటకుపైగా వారిస్తున్నా వినలేదు. విషయం తెలుసుకున్న గద్దలగుంట యువకులు, బంధువులు వచ్చి జమదగ్నిని బలవంతంగా తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది.