పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు

Study About Back Ward District Funds In AP Says Central Minister - Sakshi

రాజ్య సభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన నాలుగో విడత నిధుల విడుదల ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ థాకూర్‌ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు.మఒడిస్సాలోని కలహండి, బోలంగీర్‌, కోరాపుట్‌ జిల్లాలు, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ప్రకటించిన ప్యాకేజీ మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు.

అయితే ఈ జిల్లాల అభివృద్ధికి ఆర్థికంగా ఆలంబన ఇవ్వాలని నీతి అయోగ్‌ చేసిన సిఫార్సు మేరకే ప్రతి జిల్లాకు 300 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 2100 కోట్ల నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగానే 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలలో మూడు వాయిదాల కింద రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కలిపి 1050 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడత నిధుల విడుదలకు అవసరమైన అమోదం లభించలేదు. పొరపాటున నాలుగో విడత కింద విడుదల చేసిన 350 కోట్లను తిరిగి వాపసు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నాలుగో విడత నిధుల విడుదల ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top