కదం తొక్కిన విద్యార్థి లోకం

Students Protest On fees reimbursement in Guntur - Sakshi

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిర్వీర్యంపై వైఎస్సార్‌ సీపీ ఫీజుపోరు

ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘ నాయకుల మండిపాటు

వైఎస్‌ జగన్‌తోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

పట్నంబజారు(గుంటూరు):   చదువుల తల్లి ఒడిలో స్వేచ్ఛగా విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు సమస్యలతో సతమతవుతున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని ఆరోపిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. లాడ్జి సెంటర్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీగా సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి, ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్‌ పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో చేపట్టిన మహోన్నత పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసేలా చంద్రబాబు సర్కార్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌కు తిలోదకాలిస్తోందన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజుపోరు చేపట్టారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే ప్రభుత్వం పాలన చేస్తోందని, విద్యార్థులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారన్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దిగిపో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటామని ప్రతినబూనింది. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నేతలు విఠల్, వినోద్, గంటి, రవి, బాజీ, జగదీష్, నాగరాజు, అజయ్, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అత్యుత్సాహం
వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నేతలు ప్రదర్శన చేపట్టే సమయానికి టీడీపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన చేపట్టారు. పూర్తిస్థాయిలో రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలువరించి సుమారు గంటన్నరకు పైగా ఆందోళన చేపట్టి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఇదంతా పోలీసులు ఎదుటే జరిగింది. దిష్టిబొమ్మ తగులబెడుతుంటే.. మారు మాట్లాడని పోలీసులు విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ప్రదర్శనలో అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నేతలు ఉన్నారంటూ..గంటన్నరకు పైగా వైఎస్సార్‌ సీపీ నేతలను, విద్యార్థులను నడిరోడ్డుపై నిలబెట్టారు. ప్రదర్శనలో పాల్గొన్న నేతలకు పోలీస్‌ అధికారులు బెదిరింపులకు దిగారు. అధికార పక్షానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విద్యార్థులు బాహాటంగానే విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top