శ్రావణ్,సాయికుమార్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం వెడిచర్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు.
గొంతు కోసుకుని ఒకరు, పురుగుమందు తాగి మరొకరు
గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం వెడిచర్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రావణ్ (21), సాయికుమార్ (20) ప్రాణాలు తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల బంధువుల కథనం మేరకు.. వెడిచర్లకు చెందిన శ్రావణ్ జార్ఖండ్‌లో ఏజీ బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సాయికుమార్ గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
సెలవులు కావడంతో నాలుగు రోజుల కిందట సాయికుమార్ స్నేహితులతో కలసి చెన్నై వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి జార్ఖండ్‌లో శ్రావణ్ వద్దకు వెళ్లాడు. రెండు రోజులైనా సాయికుమార్ నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లి ఫోన్ చేయగా చెన్నైలోనే ఉన్నానని నమ్మబలికాడు. తరువాత ఏం జరిగిందో ఏమో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారణాసిలో గంగానది ఒడ్డున గొంతు కోసుకుని శ్రావణ్, పురుగుమందు తాగి సాయికుమార్ అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. వారివద్ద ఉన్న ఫోన్‌లో నంబర్ల ఆధారంగా పోలీసులు వెడిచ ర్లలో ఒకరికి ఫోన్ చేశారు. మృతుల తల్లిదండ్రులు వారణాసిలో ఉన్న నిమ్మకాయల లారీ డ్రైవర్లకు సమాచారం అందించారు. వారు మృతుల ఫొటోలను వాట్సప్‌లో పంపారు. మృతదేహాలు తమ పిల్లలవేనని నిర్ధారించుకున్న తల్లిదండ్రులు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు.
కిడ్నాప్ కేసే కారణమా?: గత నెలలో గూడూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శ్రావణ్‌పై కిడ్నాప్, కులదూషణ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన శ్రావణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


