జ్ఞానభేరిలో నిరసన సెగ

Student protests on CM Chandrababu Jnanabhumi - Sakshi

సీఎం చంద్రబాబు సభలో ఆందోళన ధ్వనులు

నిరుద్యోగ భృతి కుదింపుపై విద్యార్థి నేతల నిరసన

ప్రత్యేక హోదా తీసుకురావాలంటూ నినాదాలు

జ్ఞానభేరిలో అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు

తిరుపతి తుడా / యూనివర్సిటీ క్యాంపస్‌:   జ్ఞానభేరి సభకు నిరసన సెగ తాకింది. ప్రత్యేక హోదా.. నిరుద్యోగ భృతి అంశాలపై విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో శనివారం జ్ఞానభేరి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సీఎం వేదికపైకి రాగానే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సభలోకి ప్రవేశించారు. వేదిక ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. 

నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి  చెల్లించాలని, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని  నినాదాలు చేశారు.  పోలీసులు వెంటనే వీరిని నిలువరించారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సభ ముగిసే సమయంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు నాగరాజు ముందుకు చొచ్చుకొచ్చాడు. బ్యారికేడ్లను దూకేందుకు ప్రయత్నించాడు. ప్రత్యేక హోదా తీసుకురావాలంటూ డిమాండ్‌ చేశాడు.  పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుడిని వేదికపైకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పోలీసులు పట్టించుకోలేదు.

సభలో రెండు పర్యాయాలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీ సులు కలవరపడ్డారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మదన్, జయసింహ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగ భృతిని మొక్కుబడిగా ప్రకటించారన్నారు. నిరుద్యోగులందరికీ నిబంధనలు లేకుండా చెల్లించాలన్నారు.  తొలి నుంచి మాటమీద ఉండి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చుండేదన్నారు. ఆందోళనలో శ్రీధర్, నాగరాజు, ముయప్ప పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి సంఘ నాయకుల నిర్బంధం
జ్ఞానభేరి కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే నెపంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నాయకులను శనివారం వేకువజామునే  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారని సమాచారం అందుకున్నాక  విడిచిపెట్టారు.

ఆకట్టుకున్న ప్రాజెక్టు వర్క్‌లు
♦ శ్రీవెంకటేశ్వర యూనివర్సీటీ సేడియంలో శనివా రం జ్ఞానభేరి కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు వర్క్‌లు  ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను వివరించారు.  తిరుపతి డెయిరీ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థులు వైష్ణవి, మోహన్‌ కృష్ణ పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సాధించే విధానం వివరించారు. ఈ ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది. 

♦ ఎస్వీ వ్యయసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు అఫీయాఫెనికా, ఖైరున్నీసా బేగం తాము చేసిన ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. 

♦ గుండెపోటుతో  ప్రాణం పోకుండా సీపీఆర్‌ టెక్నిక్‌ ఉపయోగించి గుండెను పనిచేయించవచ్చని స్విమ్స్‌ విద్యార్థులు రుచిత, పూజ, లాస్య వివరించారు. 

♦ రేబిస్‌ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టు వర్క్‌ చేస్తున్నట్లు వెటర్నరీ విద్యార్థులు సౌమ్య, హిమబిందు తెలిపారు. 

♦ పంటలను నాశనంచేసే అడవి పందుల నుంచి రక్షణ కోసం లేజర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ను సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించారు. 

దామినేడు హౌసింగ్‌ కాలనీ ప్రారంభం
తిరుచానూరు: తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన  ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న పట్టాదారు భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

దామినేడు వద్ద  హౌసింగ్‌ కాలనీని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు.  తిరుపతితో పాటు తనపల్లి, బాలాజీ డెయిరీ, పాడిపేట ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను 18 నెలల్లో పూర్తిచేసి సుమారు 2592 ఇళ్లను ప్రారంభించారని తెలిపారు.   ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్టోబర్‌ 2న,  సంక్రాంతి రోజున మరోసారి గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top