కన్నీళ్లు తుడిచేదెవరు?

Still Waiting For Fishermens Boat From Pakistan Coast Guards - Sakshi

పాకిస్తాన్‌లో బందీలుగా జిల్లాలోని మత్స్యకారులు

ఐదు రోజులైనా స్పందించని ప్రభుత్వాలు

పలకరించడానికి కూడా వెళ్లని స్థానిక ఎమ్మెల్యే

తమవారికోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

నిత్యం చేపల వేట హడావుడితో సందడిగా ఉండాల్సిన ఆ పల్లెల్లో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. అన్ని ఇళ్లల్లోనూ నిశ్శబ్దం తాండవిస్తోంది. తమవారు ఏడున్నారో... ఎలా ఉన్నారో... ఏం తింటున్నారో... ఎప్పటికి వస్తారో... తెలీక ఆ మత్స్యకార కుటుంబాలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి. కనిపించిన ప్రతీ ఒక్కరినీ కన్నీటితో వేడుకుంటున్నాయి. ఇదీ నాలుగు రోజులుగా పాకిస్తాన్‌ చెరలో ఇరుక్కున్న మత్స్యకార కుటుంబాల వేదన.

సాక్షిప్రతినిధి, విజయనగరం: అసలేం జరుగుతోంది.. నిండు ప్రాణాలు ప్రమాదంలో పడితే కనీసం ఒక్కరంటే ఒక్కరైనా అధికారపార్టీ నేతలు నోరుమెదపడం లేదదెందుకని.? నియోజకవర్గ ప్రజలకు ఇంత కష్టం వస్తే కనీసం వారిని కలిసి ధైర్యం చెప్పడానికి కూడా అధికారపార్టీ ఎమ్మెల్యేకు మనసు రావడం లేదెందుకని? పాకిస్తాన్‌ చెరనుంచి మన మత్స్యకారులను విడిపిం చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుం దో, అసలు చేస్తుందో లేదో తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదెందుకని? ఎందుకంటే., జాలరి పల్లెల్లో చీకట్లు ముసిరేలా చేసింది ఈ టీడీపీ ప్రభుత్వమే కాబట్టి. వారి జీవితాలను వలస బాట పట్టించి నరక కూపాల్లోకి నెట్టేసింది వారే కాబట్టి.

క్షణమొక యుగంలా:జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలా లతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందినమొత్తం 20 మంది మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్‌ నుంచి చేపల వేటకు బయలుదేరి దురదృష్ట వశాత్తూ పాక్‌ సరిహద్దుల్లో ప్రవేశించి అక్కడి కోస్ట్‌గార్డ్‌ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఈ దుర్ఘటన జరిగి ఐదు రోజులు గడిచిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. వారిని విడిపించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడికావడం లేదు. ఈ నేపథ్యంలో తమ వారికి ఏం జరుగుతుందోనని వారి కుటుంబ సభ్యులు ఇక్కడ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి కోసం క్షణమొక యుగంలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

కాలుష్యమే కారణం
తీరప్రాంత గ్రామాలను ఆనుకొని వున్న రసాయన పరిశ్రమల వ్యర్థజలాలు జీరో డిశ్చార్జ్‌ చేయకుండానే సముద్రంలోకి వదలడంతో మత్స్యసంపద నాశనమవుతోంది. సముద్రంలో వందల కిలో మీటర్ల దూరం వెళ్లినా మత్స్యసంపద దొరక్క డీజిల్‌ ఖర్చుకు కూడా వచ్చిన ఆదాయం సరిపడక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితిలో వేట సాగక వలస వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు రెండు వేలు పైగానే వలస వెళ్లారు. వలసలు ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా మత్స్యకారులను చిన్నచూపు చూస్తోంది.

స్వయం ఉపాధి ఏదీ?
జిల్లాలోని మత్స్యకారులను ఆదుకోవడానికి కలెక్టర్‌ హరిజవహర్‌ ఆదేశాల మేరకు కోనాడలో ఆర్‌డీఓ వెంకటమురళి సమక్షంలో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అర్హతను బట్టి స్వయం ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హడావుడి చేసిన అధికారులు మూడు నెలలు దాటుతున్నా నోరెత్తడం లేదు. తీరప్రాంత గ్రామాల్లో అత్యధికంగా ప్రభుత్వ భూములు వుండటం, చెరువులు లేకపోవడంవంటి కారణాలతో మత్స్యకారులకు ఉపాధిహామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
తిప్పలవలసకు చెందిన మత్స్యకారులు పాక్‌లో చిక్కుకొని ఐదురోజులు దాటుతున్నా అధికారుల్లో చలనం లేదు. బాధిత కుటుంబాలను కనీసం ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. తక్షణమే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందజేసి ఆదుకోవాలి.– వాసుపల్లి అప్పన్న,మాజీ సర్పంచ్, తిప్పలవలస

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top