ఆరో రోజూ...అదే ఆగ్రహం 

Still Continuous Flow At  Dhavaleswaram First Flood Warning Signal In East Godavari - Sakshi

ఇంటా బయటా నీరు... కాలు బయట పెట్టాలంటే భయం... నిత్యావసర వస్తువులు తెచ్చుకునే వీలులేదు ... తెచ్చినా పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. బిక్కుబిక్కుమంటున్న బాధితులకు భరోసానిస్తూ వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. 

సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : జిల్లా వాసులకు అన్నపానీయాలు అందించే జీవనది గోదావరి కొన్ని రోజులుగా ఉరుముతూ...వరద ఉరకలేస్తూ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం కొంతమేర తగ్గుముఖం పట్టినా ఎగువ మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడం.. భద్రాచలం వద్ద తిరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అటు ఏజెన్సీ గ్రామ వాసులను..ఇటు లంక వాసులను తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. వరద సహాయక చర్యలు, బాధితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం మంగళవారం నుంచి వరద విపత్తు పెరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భద్రాచలం వద్ద 43 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణాలోని మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఆ ప్రభావం వచ్చే 24 గంటల్లో జిల్లాపై పడుతుందేమోనని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదే జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో వరద ఉధృతి తగ్గింది.  ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద 12.50 అడుగులకు తగ్గింది. సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 10.92 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గోదావరి వరద అధికారుల అంచనాకు అందకుండా పోయింది. సోమవారం రాత్రికే రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేయాల్సి వస్తుందని సాగునీటి పారుదల శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. ఇన్‌ఫ్లో కూడా 14 లక్షలు ఉంటుందని భావించారు. అయితే వారి అంచనాల మేరకు బ్యారేజీ వద్ద వరద లేకపోవడం విషయం కాగా, ఉన్న వరద కొంత తగ్గడం గమనార్హం. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో కొత్త ప్రాంతాలకు వరద విస్తరిస్తోందని, దీనివల్ల బ్యారేజీకు గతం కన్నా తక్కువ సమయానికి వరద వస్తోందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి వరద పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ప్రభావం జిల్లాలో తగ్గుతున్నా అటు ఏజెన్సీ, ఇటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి.

దేవీపట్నం మండలం ముంపు నుంచి నెమ్మదిగా బయటపడుతోంది. ఇక్కడ రెండు అడుగుల మేర నీరు తగ్గింది. గడిచిన నాలుగు రోజులుగా గోదావరి, శబరి నదులు వరదల వల్ల వి.ఆర్‌.పురం మండలంలో సుమారు 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు సోమవారం కూడా ప్రారంభం కాలేదు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భద్రాచలం వద్ద 76 అడుగుల వరద వచ్చినప్పుడు కూడా ఇంత ముంపు లేదని వారు చెబుతున్నారు. ఈసారి మరింత వరద వచ్చే అవకాశముందనే అంచనాలతో నదిని ఆనుకుని ఉన్న గ్రామం కావడంతో ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని పోచమ్మగండివాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు బాధితులకు రంపచోడవరం గొర్రనగూడెం పాఠశాల, వీరవరం వద్ద తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, దేవీపట్నంలో ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, దామనపల్లి పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి.

ముంపులో ఉన్నా కొంతమంది ఇళ్లు వీడి వచ్చేందుకు ముందుకు రాకపోవడంతో భోజనాన్ని పట్టుకుని వెళ్లి అందిస్తున్నారు. ఏజెన్సీతోపాటు కోనసీమలోని మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు అడుగుల మేర వరద తగ్గింది. గోదావరి మధ్యలో ఉన్న లంక వాసులతోపాటు కాజ్‌వేలు ముంపుబారిన పడడంతో ఏటిగట్టును ఆనుకుని ఉన్న గ్రామాల వాసులు సైతం రాకపోకలకు పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడం, తాజాగా ఎగువన వరద పెరగడంతో తమ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవని లంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు తోడు, కోనసీమలో పలుచోట్ల భారీ వర్షం పడుతుండడం మురుగునీటి కాలువల ద్వారా ముంపునీరు దిగే అవకాశం లేక వరి ముంపు తీవ్రత మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top