చిత్తూరు జిల్లాలో పంచలోహ విగ్రహాలను దొంగిలించి మానుకోటలో విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరిని నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు.
=రూ.80 లక్షలు విలువ చేసే పంచలోహ విగ్రహాలు స్వాధీనం
=వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ శోభన్‌కుమార్
నెల్లికుదురు, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లాలో పంచలోహ విగ్రహాలను దొంగిలించి మానుకోటలో విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరిని నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ పి.శోభన్‌కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలోని సుంచురామిచెట్టు కందీగ గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2006 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన గౌని మునస్వామి, ఉరందర్ ధనుంజయ, పాయ మధు అనే ముగ్గురు వ్యక్తులు సుమారు (21కిలోల బరువున్న) ప్రసన్న వెం కటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలను దొం గిలించారు. ఈ విషయంపై ఆలయ పూజారులు, గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయితే వరదాయపాలెం మండలంలోని తొండబొట్టు గ్రామానికి చెందిన గౌని చంద్ర, నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని పాతర్లపాడుకు చెందిన తండా అంజయ్యకు తాము దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు పై ముగ్గురు ముందుగా ఒప్పందం చేసుకున్నారు.
ఆరేళ్ల కాలంలో వారు ఎక్కడా కూడా దొం గిలించిన విగ్రహాలను విక్రయించలేదు. దీంతో ప్రసన్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో విక్రయించేందుకు ఇటీవల ఉరందర్ ధనుంజయ పట్టుకుని వెళ్తుండగా మార్గమధ్యలో అతడు వరదాయపాలెం పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే మిగిలిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలను విక్రయించేందుకు మునస్వామి, పాయ మధు బుధవారం ఉదయం తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో అదే మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తున్న నెల్లికుదురు పోలీసులకు వారు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం మునస్వామి, మధు నుంచి రూ.80 లక్షల విలువ చేసే శ్రీదేవి, భూదేవి విగ్రహాలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, విగ్రహాల దొంగలను పట్టుకునేందుకు కృషిచేసిన తొర్రూరు సీఐ రాజు, ఎస్సై ముప్పారపు కరుణాకర్, ట్రైనీ ఎస్సై నాగభూషణం, ఏఎస్సై రాజేందర్, కాని స్టేబుళ్లు శ్రీనివాస్, శ్రవణ్‌ను డీఎస్పీ అభినందించారు.