
సాక్షి, ఒంగోలు టూటౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రకటించిన కొత్త పథకానికి నవోదయం అనే పేరు కూడా పెట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే శుక్రవారం అసెంబ్లీలో ఈ కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం సుమారుగా 86 వేల వరకు గుర్తించింది.
రూ.4వేల కోట్ల రుణాలు వన్ టైం రీస్ట్రక్చర్ చేయడానికి కేబినేట్ ఆమోదం తెలపడంపై సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల యజమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న పరిశ్రమ ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టనుంది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తొమ్మిది నెలల వ్యవధిని ఏపీ కేబినేట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
సంక్షోభం నుంచి పురోగమనం దిశగా..
జిల్లాలో 71 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా.. 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో గ్రానైట్, ఆక్వారంగంతో పాటు ఇటుకల పరిశ్రమలు, సిమెంట్ ప్‌లైయాష్ బ్రిక్స్, బీరువాల తయారీ, విస్తరాకుల తయారీ, పచ్చళ్ల తయారీ, పాడి పరిశ్రమ, కేబుల్ నెట్‌వర్క్, మంచినీటి వ్యాపారం, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ, ప్రింటింగ్ రంగం, టైలరింగ్, జనపనార సంచుల తయారీ వంటి ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం చిన్న పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఎక్కువ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక చాలా వరకు మూతపడినవి కూడా ఉన్నాయి. ఇలా మూతపడిన పరిశ్రమలలో 30 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే ఉండటం గమనార్హం. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 40 శాతం వరకు జిల్లాలో ఉన్నాయి.
వీటిలో అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తర హా పరిశ్రమలను ఆర్థిక చేయూత కల్పించి తిరిగి జీవం పోసేందుకు సర్కార్ శ్రీకారం చుట్టడంపై పరిశ్రమల వర్గాల్లో సర్వాత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డిక్కి ప్రతినిధులు వి. భక్తవత్సలం, హరిప్రసాద్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చిన్న పరిశ్రమలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సర్వాత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు కోటిరూపాయల వరకు రుణం మంజూరుకు అవకాశం కల్పించే ప్రకటన చేయడం కూడా ఊరట కలిగించిందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల రానున్న ఐదేళ్లలో చిన్న పరిశ్రమలు ఊపందుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫలితంగా మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కలగుతాయని తెలిపారు.
ఎస్సీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్..
చిన్న పరిశ్రమలకు చేయూతతో పాటు ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయంతీసుకుంది. దీంతోరాష్ట్రంలో 15,62,684 మంది ఎస్సీలకు లబ్ధి కలగనుంది. జిల్లాలో 7,30,412 మంది ఎస్సీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకానికి రూ.411 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్ గతంలో కేవలం 100 యూనిట్ల వరకే ఉండేది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మరో 20 యూనిట్లను అదనంగా పెంచింది. ఇదే సమయంలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం శుక్రవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.