సగం ధరకే శ్రీవారి లడ్డూ

Srivari Laddu at half price - Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  

సాక్షి ప్రతినిధి, తిరుపతి:  లాక్‌డౌన్‌ ముగిసే వరకు శ్రీవారి లడ్డూ ప్రసాదం సగం ధరకే అందించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామివారి లడ్డూ ప్రసాదం అందించాలని భక్తుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు రూ.50 లడ్డూను రూ.25కే అందించనున్నట్లు చెప్పారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి చైర్మన్‌ బుధవారం శ్రీపద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. భక్తులకు స్వామివారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరైనా ఎక్కువ మోతాదులో లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులకు పంచదలచుకుంటే ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ 9849575952, ఆలయ పోటు పేష్కార్‌ శ్రీనివాస్‌ 9701092777ను సంప్రదించాలని కోరారు. కాగా, 2019 ఏప్రిల్‌లో ఈ–హుండీ ద్వారా స్వామి వారికి రూ.1.79 కోట్ల కానుకలు అందగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.97 కోట్ల కానుకలు వచ్చాయని సుబ్బారెడ్డి చెప్పారు.  

టీటీడీకి నిధుల కొరత లేదు 
టీటీడీకి నిధుల కొరత ఉందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, టీటీడీ నిర్వహణకు గానీ, ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు గానీ ఎలాంటి నిధుల కొరత లేదని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రాదని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top