25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

Srivari laddu for devotees from 25th - Sakshi

13 జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి

సగం ధరకే విక్రయం

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గల టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపంలో లడ్డూలను అందుబాటులో ఉంచుతారు. లాక్‌డౌన్‌ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేంత వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333ను సంప్రదించవచ్చు.
 
ఎక్కువ మొత్తంలో కావాలంటే..
ఎక్కువ మొత్తంలో అనగా 1,000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయదలిచిన భక్తులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్‌ నంబరు వివరాలను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com అనే మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది. వీరికి లభ్యతను బట్టి తిరుపతిలోని టీటీడీ లడ్డూ కౌంటర్‌ నుంచి గానీ, సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల నుంచి గానీ లడ్డూలను అందజేస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు.

టీటీడీ ఆన్‌లైన్‌ సేవల వెబ్‌సైట్‌ మార్పు
తిరుపతి సెంట్రల్‌: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలను బుక్‌ చేసుకోవడంతో పాటు ఈ–హుండీ, ఈ–డొనేషన్‌లకు అందుబాటులో ఉన్న http:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను http:/tirupatibalaji.ap.gov.inగా మార్పు చేసినట్లు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం (నేటి) నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొన్నారు. మార్పు చేసిన వెబ్‌సైట్‌ను భక్తులు వినియోగించుకోవాలని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top