అచ్చతెలుగు ఆడపడుచు

Sridevi is a pure telugu women - Sakshi

చంద్రగిరి/రాయచోటి రూరల్‌: సినీ లోకాన్ని ఏలిన ఇండియన్‌ సూపర్‌స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి తెలుగమ్మాయే. ఈమె తల్లి రాజేశ్వరి తిరుపతిలోని తీర్థకట్టవీధిలో జన్మించారు. శ్రీదేవి అమ్మమ్మ వెంకటరత్నమ్మది వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గేరంపల్లె. విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే నర్సుగా పనిచేస్తుండేవారు. తిరుపతికి చెందిన వెంకటస్వామిరెడ్డితో వివాహం తర్వాత తీర్థకట్టవీధి డోర్‌ నం.93లో నివాసముండేవారు. వారికి రాజేశ్వరి, అనసూయమ్మ, అమృతమ్మ, శాంతకుమారి, బాలసుబ్రమణ్యం, సుబ్బరామయ్య సంతానం. ఇందులో మొదటి కుమార్తె శ్రీదేవి తల్లి రాజేశ్వరి. చెన్నైలో చదువుతుండగా తోటి విద్యార్థి, సేలంకు చెందిన అయ్యప్పన్‌ను ప్రేమవివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.

రెండో కుమార్తె అనసూయమ్మను తిరుపతి ఆకు తోటవీధిలో నివాసముంటున్న కాంట్రాక్టర్‌ నారాయణరెడ్డికి ఇచ్చిచేశారు. మూడో కుమార్తె అమృతమ్మ చెన్నైకి చెందిన ఇంజినీరును వివాహం చేసుకున్నారు. నాలుగో కుమార్తె శాంతకుమారి సేలంకు చెందిన మున్సిపాలిటీ ఉద్యోగి సెల్వంరెడ్డిని వివాహమాడి అక్కడే ఉండి పోయారు. శ్రీదేవి మేనమామ బాలసుబ్రమణ్యం చెన్నైలో సెంట్రల్‌ ఫుడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ స్థానికంగా ఉంటున్న బేబిని పెళ్లి చేసుకున్నారు. సుబ్బరామయ్య చెన్నైలోని  ప్రభుత్వ లెదర్‌ కంపెనీలో పనిచేసేవారు. చంద్రగిరి మండలం ఏ.రంగంపేటకు చెందిన వేణగోపాల్‌రెడ్డి సోదరి నిర్మలను వివాహం చేసుకున్నారు. కాగా, 1991లో శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ చెన్నైలో మరణించారు. 1997లో తల్లి రాజేశ్వరి మృతి చెందారు. ఆమెకు అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకెళ్లగా.. అక్కడ ఆమె తలకు ఒక వైపు చేయాల్సిన ఆపరేషన్‌ మరోవైపు చేయడంతో మరణించారు. ఈ సంఘటన అప్పట్లో వివాదానికి దారి తీసింది. 

అనసూయమ్మ అంటే ఎంతో ఇష్టం  
శ్రీదేవి పిన్నమ్మ అనసూయమ్మ అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం. వివాహంగాక ముందు శ్రీదేవిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమెకు నారాయణరెడ్డితో వివాహమైన తర్వాత తిరుపతికి వచ్చేశారు. తరచూ అనసూయమ్మ యోగక్షేమాల కోసం శ్రీదేవి తిరుపతికి వచ్చేవారు. పిన్నమ్మ ఆరోగ్యంతో పాటు వారి యోగక్షేమాలపై శ్రద్ధ వహించేవారు.  

ఎ.రంగంపేటతో విడదీయరాని అనుబంధం  
చంద్రగిరి మండంలోని ఎ.రంగంపేట గ్రామంతో నటి శ్రీదేవికి విడదీయరాని అనుబంధం ఉంది. మేనత్త నాగమ్మది రంగంపేట. ఆమె కుమార్తె అమరావతమ్మ వివాహమప్పుడు శ్రీదేవికి ఎనిమిదేళ్లు. ఆ సమయంలో సుమారు పది రోజుల పాటు శ్రీదేవి తన తల్లిదండ్రులతో వచ్చి ఎ.రంగంపేటలోని నాగమ్మ ఇంట్లోనే ఉన్నారు. 

భగవంతుడు చిన్నచూపు చూశాడు 
మా అన్న కుమార్తె శ్రీదేవిపై భగవంతుడు చిన్న చూపు చుశాడు. ఆమె ఎప్పుడు తిరుపతికి వచ్చినా మాతో ఎంతో ప్రేమగా మాట్లాడేది. తాను చిన్నతనంలో మా ఇంటికి వస్తే సుమారు వారం రోజులపాటు ఉండేది. నటిగా పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె నిరాడంబరంగా అందర్నీ ఆప్యాయంగా పలకరించేది. అలాంటి మంచి మనిషి మృతి చెందడం చాలా బాధాకరం.   
 – వేణుగోపాల్‌రెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top