ఏ పీఠం లక్ష్యమైనా... ధర్మరక్షణే | Sri Siddheshwarananda Bharati Swami The Head Of The Sri Lalithapeetha Chanting Said That The Aim Of Any Peetham Is Dharma Protection And Universal Well Beingg | Sakshi
Sakshi News home page

ఏ పీఠం లక్ష్యమైనా... ధర్మరక్షణే

Aug 2 2019 10:59 AM | Updated on Aug 20 2019 12:42 PM

Sri Siddheshwarananda Bharati Swami The Head Of The Sri Lalithapeetha Chanting Said That The Aim Of Any Peetham Is Dharma Protection And Universal Well Beingg - Sakshi

ఏ పీఠం లక్ష్యమైనా ధర్మరక్షణ, సర్వమానవ శ్రేయస్సేనని కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ లలితాపీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అభిభాషించారు. సమాజంలో హిందూ ధర్మాన్ని రక్షించడం, ప్రచారం చేయడం, లౌకికంగా ధర్మ రక్షణ చేపట్టడమే ధార్మిక సంస్థల కర్తవ్యమని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెరుగుతుండటం సంతోషమే అయినా.. మంత్ర సాధన, తపశ్శక్తి తగ్గుతున్నాయని అన్నారు. మనిషిని రక్షించేవి ఇవేనని చెప్పారు. చాతుర్మాస దీక్షల నిర్వహణలో భాగంగా నగరంలోని కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత శ్రీ లలితా పీఠంలో వేంచేసి ఉన్న స్వామి గురువారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు. స్వామి మాటల్లోనే చదువుకుందాం..      – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షిప్రతినిధి, విశాఖపట్నం:  ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది. ఆధ్యాత్మిక చింతనా వెల్లివిరుస్తోంది. గతంలో కాశీ, తిరుపతి, శ్రీశైలం, ఉజ్జయిని వంటి మహా పుణ్యక్ష్రేతాలకే భక్తులు పెద్దసంఖ్యలో వెళ్ళే వారు. కానీ ఇప్పుడు ఏ దేవాలయంలో చూసినా జనమే కనిపిస్తున్నారు.. దేవాలయాల సంఖ్యా పెరుగుతోంది. కానీ తపశ్శక్తి తగ్గుతోంది. ఏకాగ్రతతతో ఆ శక్తిని సిద్ధింపజేసుకోవాలి. మంత్ర సాధనతో భక్తిభావం పెంపొందించుకోవాలి. మంత్రాల్లో దేవతల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అవి మనం సృష్టించినవి కావు. ఆ మంత్రాలను ఇచ్చిన దేవతలు అందులో తమ శక్తిని నిక్షిప్తం చేశారు. ఒక్కో మంత్రంలో ఒక్కో దేవత ఉంటుంది. మంత్రం పఠిస్తే దేవత దిగివచ్చేలా ఉండాలి. మంత్ర శక్తితో ఎంతో మంది గురువులు ఎన్నో సాధించారు. పూర్వం  మంత్రశక్తితో దేవతలు దిగివచ్చేవారు. యుగాలు మారాయి. ఈ కలియుగంలో కూడా నిష్టతో తపస్సు చేస్తే సత్ఫలితాలు పొందొచ్చు.

మంత్రమే మనిషిని రక్షిస్తుంది
మంత్రం దేవుళ్ళను  పిలవడానికి సులభమైన ఒక సాధనం. మంత్రమే మనిషిని రక్షిస్తుంది. ప్రతి మనిషీ కష్టసుఖాలను అనుభవించాల్సిందే. సుఖాలు వచ్చినపుడు ఇబ్బంది లేదు గానీ కష్టాలు వచ్చినపుడు మాత్రం అవి తీరే మార్గం ఏమిటి అని మథనపడిపోతుంటారు. అప్పుడు మాత్రం ‘మేం చాలా మంచివాళ్ళమండి.. ఎవరికీ అపకారం తలపెట్టమండి..మావల్ల ఎవరికీ ఏ కష్టం రాదండి ఈ దేవుడు ఏం చేస్తున్నాడండి..మాకు కష్టాలు ఎందుకు ఇచ్చాడండీ’ అంటూ ఆవేదన చెందుతారు. కానీ పూర్వ జన్మల కష్ట సుఖాలు అనుభవించడానికే ఇక్కడికి వస్తారన్న వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు నువ్వు మంచివాడివయినా గత జన్మలో చేసిన పాప ఫలం కచ్చితంగా ఇక్కడ అనుభవించాలి.

జపాలు, హోమాలతో గత జన్మల పాపాలూ తొలగించుకోవచ్చు
జపాలు, హోమాలు, మంత్రాలతో గత జన్మ పాపాలు పోగొట్టుకోవచ్చు. కొంతమంది పిల్లల కోసం పూజలు చేసుకోమంటే మాకు యోగం లేదంటారు. కానీ మంత్రం యోగాన్ని పుట్టిస్తుంది. అది గుర్తించగలగాలి. మంత్రంతో ఎంతటి కష్టాన్నైనా తొలగించుకోవచ్చు. అయితే మంత్రోచ్ఛరణ సాధారణ మనుషులకు సాధ్యం కాదు కాబటి వారి తరఫున పీఠాధిపతులు దీక్షాపరులు.. సమర్థవంతమైన వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి లక్షల కోట్ల జపాలు చేయించి ధార్మిక సేవ చేయిస్తున్నారు. సిద్ధేశ్వరి పీఠం ద్వారా మేం ఈ గొప్ప సేవకు అంకితమయ్యాం.

పూర్వజన్మలపై....
ప్రతి వ్యక్తి కూడా జన్మ పరంపరలోనే జన్మిస్తూ ఉంటారు. పునరపి జననం.. పునరపి మరణం.. అని జగద్గురు శంకరాచార్యుల వారే చెప్పారు. చాలామంది పూర్వజన్మలను చూశామని నాకు చెప్పారు.. వాళ్ళలో కొంతమంది ఆయా స్థలాలకు వెళ్ళి నిర్ధారించుకుని కూడా వచ్చారు. .కొన్నేళ్ళ కిందట  హిందూయేతర మతానికి చెందిన అప్పటి మంత్రి సతీమణి  గుంటూరులో పీఠానికి వచ్చారు.. ధ్యానం చేసుకోవచ్చా అని అడిగారు..ఎందుకలా అడుగుతున్నారు..దేవత యం దు విశ్వాసం కలిగి వస్తే.. ఎవరైనా చేయొచ్చు అని అన్నాను.. ఆమె ధ్యానం చేసుకుని పూర్వ జన్మ కనిపిస్తోందని అన్నారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌ బియాన్‌ వీసీ  మనుషులను హిప్నటైజ్‌ చేసి పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పిస్తుంటారు. టీవీల్లో కూడా రిలే అయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన జీవించే ఉన్నారు. ఆయన హిప్నటిజం మార్గంలో చెబుతున్నారు.. మనం ధార్మిక మార్గంలో అన్వేషిస్తున్నాం.. అంతే తేడా.

తపస్సుతో తరించు.. సమాజానికి అర్పించు
తపస్సు చేసి తరించు. అందులో కొంత భాగం సమాజానికి అర్పించు.. అనే నేను భక్తులకు అనుగ్రహభాషణం చేస్తుంటాను. వ్యక్తులకు లౌకికమైన, భౌతికమైన, మానసికమైన సమస్యలు వచ్చినప్పుడు దివ్యశక్తి ద్వారా. మంత్రశక్తి ద్వారా సమస్యలను పరిష్కరించుకునే శక్తిని సంపాదించుకోవాలని చెబుతుంటాను..దేశ విదేశాల్లో హిందూ ధర్మ పరిరక్షణతో పాటు మంత్ర శక్తి, దైవశక్తిపై నమ్మకం, దివ్యానుభవాలు పొందేలా చేయడమే మా పీఠం లక్ష్యం.

తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు బాగుంది..
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు బాగుంది. బాగుండాలనే మేమందరం అభిలషిస్తాం. పీఠాధిపతుల కర్తవ్యం ప్రజలు సుభిక్షంగా ఉండటమే. హిందూ ధర్మంలో ఓ గొప్ప సంప్రదాయముంది. ఓ వ్యక్తి తన ఇంట్లో  పూజ, తపస్సు, యజ్ఞం ఏది చేసినా.. తన కోసమే చేసుకున్నప్పటికీ  చిట్ట చివర స్వస్తిప్రయాక్ష పరిపాలయంతాం... అంటూ ప్రజలతో పాటు ప్రజలను పరిపాలించే రాజులు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు.. అటువంటిది ధర్మ పీఠాల నిర్వాహకులైన మేము తప్పకుండా ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలూ బాగుండాలని, ధర్మం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలనే నిత్యం ధ్యానిస్తాం. పూజిస్తాం. 

చాతుర్మాస దీక్షా విశేషం...
సన్యాసులు ఒక్కచోట నిలకడగా ఉండకూడదు. సంచరిస్తూ ధర్మాన్ని ప్రభోదిస్తూ ఉండాలి. అయితే వర్షాకాలంలో నాలుగు నెలల పాటు వారి సంచారానికి అనుకూలంగా ఉండదు కాబట్టి.. ఒక చోట స్థిరంగా ఉండి అక్కడే తపస్సు చేసుకుంటూ ధర్మ ప్రభోదం చేయడం  ఒక పద్ధతి, నియమంగా ఏర్పడింది. సన్యాసోపనిషత్‌లో ఇవన్నీ చెప్పడం జరిగింది. దీన్నే చాతుర్మాస దీక్ష అని అంటారు. అయితే ఇప్పుడు వసతులు పెరిగిన తర్వాత మాసస్య పక్షః అని నాలుగు నెలలకు నాలుగు పక్షాలు.. అంటే రెండు నెలల కాలంలో చాతుర్మాస దీక్ష చేయడం జరుగుతోంది.  సన్యాసులే కాదు.. గృహస్తులు కూడా ఈ దీక్ష చేయొచ్చు.. ఈ ఏడాది చాతుర్మాస దీక్ష విశాఖలోనే చేస్తున్నాను. సెప్టెంబర్‌ 14 వరకు దీక్షలో ఉంటాను. గతంలో కాశీ, బృందావనం, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో దీక్షలు చేశాను. ఈ ఏడాది భక్తుల కోరిక విశాఖ లలితాపీఠంలో  చేయాలని సంకల్పించాం. విశాఖ లలితా పీఠం(సిద్దేశ్వరీ పీఠం) మహనీయమైన పీఠం. దక్షిణామూర్తి పరమహంస అనే మహోన్నత వ్యక్తి స్థాపించారు. ఆయన శిష్యుడు సముచితానంద భారతి అనే స్వామి అభివృద్ది చేశారు. ఆయన తరువాత నేను పీఠం బాధ్యతలు తీసుకున్నాను.

అమెరికాలో 108అడుగుల శంకరాచార్యుల విగ్రహం
హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఆసేతు హిమాచలమే కాదు.. ఇతర దేశాలూ, ఖండాలూ పర్యటిస్తున్నాను.  కైలాస మానస సరోవరంలో ఎక్కువగా ఉంటాను. ఇటీవల అమెరికాలో 500 ఎకరాల స్థలం తీసుకున్నాం. అక్కడ ఆశ్రమం నిర్మించాలని సంకల్పం చేశాం. అక్కడే జగద్గురు శంకరాచార్యుల 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement