లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం


ఒంగోలు సెంట్రల్ : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం లోక్ అదాలత్‌తోనే సాధ్యమని కలెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు సముదాయాల ఆవరణలో శనివారం నిర్వహించిన రెండో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంఘటన జరిగినప్పుడు ఆగ్రహం, ఆవేదనతో పెట్టిన కేసులను అనంతరం ఉపసంహరించుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదన్నారు. అలాంటి కేసులతో పాటు ఇరువర్గాలు రాజీపడే కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కొన్ని కేసులకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లడం ద్వారా విలువైన సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు.



ఇలా ఇరువర్గాలూ నష్టపోకుండా ఉండాలంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే సుప్రీంకోర్టులో పరిష్కారమైనట్లేనని, దానిపై మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌కే మహ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసులకు సంబంధించి రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించుకుని మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ప్రజలకు సూచించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.



తద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతుందన్నారు. అనంతరం నిర్వహించిన లోక్ అదాలత్ కేసుల పరిష్కార కార్యక్రమంలో మొదటి కేసును ఎస్పీ శ్రీకాంత్ పరిష్కరించారు. కలెక్టర్ విజయకుమార్ రెండు ఐపీసీ కేసులు, ఒక వివాహ సంబంధ కేసును పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి.మోహన్‌కుమార్, ఏడో అదనపు జిల్లా జడ్జి రమణికృపావతి, జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి డి.అమ్మన్నరాజా, జూనియర్ సివిల్ జడ్జిలు టి.హరిత, శ్రీకుమార్‌వివేక్, ఎస్‌కే ఇబ్రహీం, షరీఫ్, జె.శ్రావణ్‌కుమార్, పి.లక్ష్మీకుమారి, డి.దుర్గారాణి, పలు ప్రభుత్వ శాఖల ఆధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top