రాత..  మార్చేను నీ భవిత 

Special Stroy About Hand Writing Skills For Students In Kadapa - Sakshi

సాక్షి, కడప : చక్కటి అక్షరాలు రాతను అందంగా మారుస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక  గుర్తింపు తెస్తాయి. వీటికి తోడు మంచి మార్కులు సాధించి పెడతాయి. గతంలో కేవలం కాపీ రైటింగ్‌పైనే ఆధారపడి రాతను మెరుగు పరుచుకునేవారు. కానీ నేడు చేతిరాతకు ప్రత్యేక తరగతులు వచ్చాయి. చాలామంది తల్లిదండ్రులు వీటిపైన ఆసక్తి చూపుతున్నారు.

వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల్లో జరిగే చేతిరాత తరగతులకు తమ చిన్నారులను పంపుతున్నారు కూడా. ప్రస్తుతం ఇది మరింత విస్తరించి ప్రయివేట్‌ పాఠశాలలు సైతం చేతిరాతకు వారానికి ఒక తరగతి నిర్వహిస్తున్నారు. నిపుణులు సైతం ప్రత్యేక తరగతులే కాక నిరంతరం చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాలని చెబుతున్నారు.అప్పుడే ఉత్తమ మార్కులు సాధిస్తారని పేర్కొంటున్నారు. – బద్వేలు  

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరి సాధ్యమే. చదువుతో పాటు చక్కని దస్తూరి చాలా ముఖ్యం. దస్తూరి సరిగా లేకుంటే మార్కులు కూడా తగ్గుతుంటాయి. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని జవాబు పత్రంలో అందంగా రాయడం మరొక ఎత్తు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు దస్తూరిని చక్కదిద్దుకోవడం చాలా అవసరం.

ఏడాదంతా కష్టపడి చదివిన అంశాన్ని మూడు గంటల పరీక్ష నిర్ధేశిస్తుంది. ఎంత బాగా చదివామన్నది కాదు ఎంత బాగా రాశామా అన్న దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో విషయ పరిజ్ఞానంతో పాటు దస్తూరి కూడా కీలకమే. రాయడం అనేది కేవలం చదువులో భాగం మాత్రమే కాదు. కర్సివ్‌ అక్షరాలు రాసే సమయంలో చేతి వేళ్ల కదలికల మీద పట్టు పెరుగుతుంది. దీంతో పని మీద దృష్టి సారిస్తారు. అక్షరాలు రాసే సమయంలో మెదడులోని అనేక భాగాలు చురుగ్గా మారతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇదే విషయం స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది.  

రాత మెరుగు ఇలా.. 

  • విద్యార్థులు పరీక్షా సమయంలో సమాధానాలు, కలిపిరాతగా, విడివిడిగా ఎలా రాయాలనే అనుమానం వాక్యాలను అనుసంధానం చేయలేకపోతారు.  
  • అక్షరాలను కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దవిగా రాస్తే రాత అందంగా ఉండదు. 
  • తెల్ల పేపరుపై రాసే సమయంలో ఒక లైన్‌ పూర్తయిన తరువాత రెండో లైన్‌ను మొదటిదానికి సమాంతరంగానే రాయాలి. అన్ని లైన్ల మధ్య దూరం ఒకేలా ఉండాలి.  
  • అక్షరాల మధ్య కొంత ఖాళీ స్థలం వదిలిపెడుతుంటారు. ఇలా రాస్తే అక్షరాలు, పదాలకు మధ్య తేడా కనిపించదు.  
  • అంకెలను వాడటంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ‘2’అంకెను ఆంగ్ల ఆక్షరం ‘జెడ్‌’మాదిరిగా, ‘5’అంకెను ‘ఎస్‌’మాదిరి రాస్తే మార్కులు కూడా తగ్గుతాయి.  
  • అంగ్ల అక్షరాల్లో ఐ, జే, పీలను ఇతర అక్షరాలతో కలిపే సమయంలో జాగ్రత్తగా కలపాలి. తెలుగులో ణ, మ, య అక్షరాలను సరిగా రాయాలి. 

చేతిరాతలో రకాలు 
కాలిగ్రఫీ : స్టోక్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇటాలిక్‌ ఆక్షరాలను ఈ రకంలో రాస్తారు. రాయడం ఆలస్యం అవుతుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.  
లూసిడా : సింపుల్‌గా త్వరగా రాయవచ్చు. పిల్లలు సమయం వృథా కాకుండా రాయవచ్చు. ప్రింట్‌ తరహాలో అందంగా ఉంటుంది. 
కర్షివ్‌ : కలిపిరాతను కర్షివ్‌ రైటింగ్‌ అంటారు. ఒక అక్షరం పక్క అక్షరానికి కలిపి రాయడం. కార్పొరేట్, ప్రైవేట్‌ సంస్థల్లో వినియోగిస్తుంటారు.  
నార్మల్‌ : సంప్రదాయ రాత. ఇందులో ఎత్తు, లావు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాయడం. వీటిని కొంతమేర స్టోక్స్‌ జత చేస్తే అందంగా కనిపించేలా చూడవచ్చు. పిల్లలకు ఎక్కువగా ఇదే నేరి్పస్తుంటారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top