‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి

Special Chief Secretary KS Jawahar Reddy Comments On Coronavirus - Sakshi

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి.. అక్కడ నుండి వస్తున్న వారి ద్వారా ఇక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున జిల్లాల వైద్యాధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై 13 జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో విధివిధానాలు జారీచేశామని, జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డీఎంహెచ్‌వోలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనే విషయమై ఆరా తీశారు. కాగా, చైనా నుండి తిరిగివచ్చిన 28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వారు వెంటనే మాస్క్‌ ధరించి సమీప ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని జవహర్‌రెడ్డి సూచించారు. ఇతర సమాచారం కోసం 1100, 1102 టోల్‌ఫ్రీ నంబర్లకు గానీ లేదా 7013387382 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ఓడరేవుల అధికారులను సంప్రదించి విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చిన వారి వివరాలు సేకరించాలని కూడా ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top