పెద్దక్కకు పెద్ద కష్టం..! | Sons Leav Mother On Village Lonely Ysr District | Sakshi
Sakshi News home page

పెద్దక్కకు పెద్ద కష్టం..!

May 1 2018 12:22 PM | Updated on May 1 2018 12:22 PM

Sons Leav Mother On Village Lonely Ysr District - Sakshi

కడప రూరల్‌ : ఈ చిత్రంలో కనిపిస్తున్న 78 ఏళ్ల వృద్ధురాలి పేరు శ్రీయపు రెడ్డి పెద్దక్క. స్వగ్రామం చాపాడు మండలం పెద్ద చీపాడు. భర్త చెన్నారెడ్డి దాదాపు 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్త పోతూ భార్యకు ఏ కష్టం రాకూడదని భావించాడేమో.? ఆస్తినంతా ఆమెకు రాసిచ్చి వెళ్లాడు. అయితే పేరుకు తగ్గట్టే పెద్దక్కది పెద్ద మనసు. ముగ్గురు కొడుకులు వీర శేఖర్‌రెడ్డి, వీర ప్రతాప్‌రెడ్డి, రామ రాజేశ్వరరెడ్డికి ఒక్కొక్కరికి 3.50 ఎకరాలు రాసిచ్చింది. అంతేగాక మిగిలిన 1.50 ఎకరాల భూమిని కూడా ఒక్కొక్కరికి 50 సెంట్ల చొప్పున తన బిడ్డలకే ఇచ్చేసింది. తరువాత పెద్దక్కను దిక్కులేని దానిలా వదిలేసి ఆమె కొడుకులు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. దీంతో ఆమె అందరూ ఉన్నా అనాథలా మారింది. అయినా బతకడానికి ఎవరినీ యాచించలేదు. 

ప్రతి నెలా వచ్చే పింఛన్‌ సరిపోక వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తోంది. ఇటీవల ఒక కుక్క కరిచింది. దీనికితోడు అనారోగ్యానికి గురి కావడంతో పనులకు వెళ్లలేని స్థితి. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కడపలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ఎదుట తన వేదనను వ్యక్తం చేసింది. నా కొడుకులకు ఇచ్చిన ఆస్తులు నాకేమీ అవసరం లేదు. బతికినంత వరకు నాకింత పిడికెడు అన్నం పెడితే చాలు. అని కన్నీటి పర్యంతమైంది. చావనైనా చస్తాగాని అనాథాశ్రమంలో మాత్రం చేరనని తెగేసి చెప్పింది. తన బాధను చెప్పుకోవడానికి జిల్లా జడ్జి శ్రీనివాస్‌ దగ్గరికి వచ్చానని.. ఆయన లేకపోవడంతో ఇక్కడికి వచ్చానని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement