సంధ్యను చిదిమేశాయి!

Six Year Old Child Killed In Wasps Attack - Sakshi

కందిరీగల దాడిలో ఆరేళ్ల పాప మృతి

మరో ఇద్దరికి గాయాలు

జి.మాడుగుల మండలంలో ఘటన

వెదురుకొమ్మల కోసం అడవికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కకొని ప్రాణాలు కోల్పోయింది. కందిరీగలు దాడి చేసి కుట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద సంఘటన జి.మాడుగుల మండలంలో చోటుచేసుకోగా..వంతాల సంధ్య మృత్యువుఒడిలోకి చేరింది. కందిరీగల  దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. 

సాక్షి, జి.మాడుగుల :  కె.కోడాపల్లి పంచాయతీ కవలపూలు పైవీధి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావు, వంతాల సీత భార్యభర్తలు. వీరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, గ్రామానికి చెందిన మరో ముగ్గురు గిరిజనులు కలసి గన్నేరుపుట్ట గ్రామం వద్ద అడవికి గురువారం సాయంత్రం సమయంలో వెదురుకొమ్ములు సేకరించటానికి వెళ్లారు. ఇంతలో కందిరీగలు గుంపుగా వచ్చి వీరిపై దాడి చేయగా వీరిలో అయిదుగురు వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. వంతాల సీత, వంతాల సంధ్య (6), 3 సంవత్సరాల వయస్సు గల వంతాల లక్ష్మిలపై  కందిరీగలు, కొండ ఈగలు దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఆశ వర్కర్‌ వైద్య సిబ్బందికి తెలిజేశారు. దీంతో అంబులెన్స్‌ పంపించి హుటాహూటిన జి.మాడుగుల పీహెచ్‌సీకి రాత్రి ఎనిమిది గంటల సమయంలో తరలించారు.

వైద్యాధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ వైద్యం అందిస్తున్న సమయంలో వంతాల సంధ్య మృతి చెందింది. మృతురాలి తల్లి సీత, వంతాల లక్ష్మిలకు చికిత్స అందించారు. వీరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా కందిరీగల దాడిలో తీవ్రంగా గాయపడిన వంతాల సీత, 3 సంవత్సరాల వంతాల లక్ష్మిలకు మరోసారి వైద్యం అందించేందుకు శుక్రవారం ఉదయం వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం సుమిత్ర, హెల్త్‌ అసిస్టెంట్‌ సప్పి బాలయ్యలు కవలపూలు గ్రామానికి ప్రయాసపడి కాలినడక వెళ్లారు. సీత, లక్షిలను వైద్యం చేయింటానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేసి ఎంత బతిమిలాడిన ససేమిరా అన్నారు. దీంతో భాషా సంస్కృతులతో వైద్యానికి ఒప్పించి పాడేరు కమ్యూనిటీ ఆస్పత్రికి తలించి వైద్యం చేయించారు. సీత, లక్ష్మిలు ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top