జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా

Six Telugu students in top 24 in JEE Main - Sakshi

టాప్‌–24లో ఆరుగురు తెలుగు విద్యార్థులు

టాప్‌టెన్‌లో ఆంధ్రా అమ్మాయి కొండా రేణు

టాప్‌–10లో నలుగురు తెలుగు విద్యార్థులే

టాప్‌ 24లో ఇద్దరు

ఏపీ, నలుగురు తెలంగాణ విద్యార్థులు

దేశవ్యాప్తంగా 24 మందికి 100% స్కోర్‌

మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని కొండా రేణు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు దక్కించుకుని సత్తా చాటింది. మన రాష్ట్రానికే చెందిన బొజ్జ చేతన్‌ రెడ్డి 21వ ర్యాంక్‌ సాధించాడు. తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, అడెల్లి సాయికిరణ్‌ ఏడో ర్యాంకు, కె.విశ్వనాథ్‌ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్‌ఫణి సాయి 19వ ర్యాంకులతో రికార్డుల మోత మోగించారు.

జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్‌–24 ర్యాంకర్లలోఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్‌పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. 

బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్‌ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్‌ పేపర్‌–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్‌ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్‌ మార్టిన్‌ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ అరోరా మూడో ర్యాంకు సాధించారు.  
 
మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష
జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో మెరిట్‌ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారితంగా పేపర్‌–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

 ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో రెండు దఫాలుగా జరిగిన జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్‌ స్కోరు సాధించిన 24 మంది విద్యార్థులు వివరాలను ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకుల వారీగా విద్యార్థుల జాబితా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top