పట్నా: ఈరోజు(శుక్రవారం) వెలువడే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అధికార ఎన్‌న్డీఏ కూటమి విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ భాగస్వామ్యానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు. రాజధాని పట్నాలో విజయోత్సవాలను జరుపుకునేందుకు 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అలాగే భారీ విందు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు మాట్లాడుతూ 500 కిలోల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రాలతో లడ్డూలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.
స్థానిక బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం ఈ విజయోత్సవాల కోసం ఐదు లక్షల రసగుల్లాలు, గులాబ్ జామూన్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజున పలు ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలకు నేతలను, కార్యకర్తలను, మద్దతుదారులను ఆహ్వానించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ, మహాకూలమి మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. అధికార కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పాట్నాలోని వేడుకల వాతావరణం ప్రతిబింబిస్తోంది.


