
సాక్షి, అమరావతి : ఏపీలో శనివారం ఒక్కరోజే మరో ఆరు కరోనా వైరస్ (కోవిడ్–19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గతంలో ఢిల్లీకి మత పరమైన కార్యక్రమం కోసం వెళ్లి పాజిటివ్ కేసుగా నమోదైన గుంటూరుకు చెందిన వ్యక్తి నుంచి తాజాగా దంపతులకు సోకింది. పాజిటివ్ వ్యక్తితో వీళ్లు తిరిగారన్న వార్త తెలియగానే వారిని విచారించి ఈ నెల 26వ తేదీన ఆస్పత్రిలో ఉంచారు. వీరి నమూనాలు పరీక్ష చేయగా శనివారం పాజిటివ్ అని తేలింది.తాజాగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండేసి, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.శనివారం ఒక్కరోజే 74 నమూనాలను పరీక్షించగా 68 మందికి కరోనా వైరస్ లేదని తేలింది. మిగతా ఆరు పాజిటివ్‌గా వచ్చాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 29,242 మంది ఉన్నారని, 179 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.రాష్ట్రంలో తొలి పాజటివ్ కేసుగా నమోదైన నెల్లూరు వాసి కోలుకున్నట్లుగానే.. రెండో పాజిటివ్ కేసైన విశాఖ వాసి కూడా కోలుకుంటున్నాడు.