ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం

Sivaramakrishna Says Thanks To YSR For Getting Job In Google - Sakshi

గూగుల్‌లో ఉద్యోగం సాధించిన శివరామకృష్ణ

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు

2008–14లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చదివాడు

వైఎస్సార్‌కు రుణపడి ఉంటానంటూ శివ ఉద్వేగం 

నూజివీడు : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యనందించాలన్న ఆశయంతో దివంగత వైఎస్సార్‌ స్థాపించిన ట్రిపుల్‌ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 2008–14లో చదివిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా ఏడాదికి లక్ష డాలర్ల వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆయన సతీమణి ప్రోత్సాహంతో చదువులో రాణిస్తూవచ్చాడు. అదే గ్రామంలోని లకిరెడ్డి పాపులమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600 మార్కులకు 564 సాధించి.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కించుకున్నాడు. 

కార్నెగీ మెలాన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ
బీటెక్‌లో ఈసీఈ బ్రాంచి తీసుకుని 9.27 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. ట్రిపుల్‌ఐటీలో చదువుకునేటప్పుడే అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముబారక్‌ షా పరిశోధనాపత్రాలను చదివేవాడు. దీంతో కంప్యూటర్‌ విజన్‌ అల్గోరిథమ్‌లను ఉపయోగించి ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ అనే అంశంపై పరిశోధనలు చేయడంతో పాటు.. ఇంటర్నేషనల్‌ జనరల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌లో పరిశోధనా పత్రాన్ని సైతం ప్రచురించాడు. బీటెక్‌ చివరిలో క్యాంపస్‌ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు పనిచేశాడు. టీసీఎస్‌కు అమెరికాలోని కార్నెగీ మెలాన్‌ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం ఉండటంతో కంపూటర్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు అందులో సీటు సంపాదించి.. 2019లో పూర్తిచేశాడు. ప్రస్తుతం శివరామకృష్ణ లక్ష డాలర్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గూగుల్‌ ‘మౌంటెన్‌ వ్యూఫర్‌ వరల్డ్‌ ఐపీ టీమ్‌’లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వైఎస్సార్‌ స్థాపించిన ట్రిపుల్‌ ఐటీలో చదవడం వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నానని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శివరామకృష్ణ ఉద్వేగంతో చెప్పాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top