
శివరామకృష్ణన్ కమిటీ సూచనలు విలువైనవి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణలపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు చాలా విలువైనవని, వాటిని పక్కనపెట్టి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా
అరసవల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణలపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు చాలా విలువైనవని, వాటిని పక్కనపెట్టి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లున్నట్టు కన్పిస్తోందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు కె. పోలినాయుడు అన్నారు. ఇది సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని సమస్య అతి సున్నితమైందన్నారు. మూడు ప్రాంతాల వారిని సంతృప్తి పరిచేలా అన్ని ప్రాంతాల అభివృద్ధికి భరోసానిస్తూ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తలదన్నే సూపర్‌సిటీ అంటూ ప్రజల్లో భ్రమలు కలిగించేలా ప్రకటనలివ్వడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అన్నీ మేము నిర్ణయిస్తామని ఏకపక్ష ధోరణికి ప్రభుత్వం స్వస్తి చెప్పి రాజధానిపై ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చలు జరిపి అంతిమంగా శాసనసభ ఆమోదం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జిల్లా కోశాధికారి అల్లు మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు టి.మాధవరావు, పి. ప్రవీణ్, వి.అప్పలరాజు, బి.నర్సున్నాయుడు, ఎం.సత్యనారాయణ, బి.జానకీరామ్, ఆర్.గాంధీ పాల్గొన్నారు.