మోగిన మునిసిపల్ నగారా | Similarly, municipal Press | Sakshi
Sakshi News home page

మోగిన మునిసిపల్ నగారా

Mar 4 2014 2:01 AM | Updated on Sep 2 2017 4:19 AM

మరో నెలరోజుల్లో జిల్లాలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్త చైర్మన్లు కొలువుదీరనున్నారు.

  •      ఎన్నికల నోటిఫికేషన్ జారీ
  •      వరంగల్ కార్పొరేషన్‌లో వాయిదా
  •      జనగామ, మానుకోట మునిసిపాలిటీలు...
  •      నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు
  •      మార్చి 30న పోలింగ్.. ఏప్రిల్ 2న ఫలితాలు
  •      జిల్లావ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ‘కోడ్’
  •      నెల రోజుల్లో కొలువుదీరనున్న కొత్త చైర్మన్లు
  •  సాక్షి, హన్మకొండ: మరో నెలరోజుల్లో జిల్లాలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్త చైర్మన్లు కొలువుదీరనున్నారు. మూడేళ్లకుపైగా అధికారుల పాలనలో ఉన్న ఈ పురపాలికలు ప్రజాపాలనలోకి రానున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా... ఏప్రిల్ రెండో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం మరికొద్ది కాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. మునిసిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. జిల్లాలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీలు ఉన్నాయి. వీటిలో వరంగల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే... మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి.

    గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి విలీన గ్రామాలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కానీ.. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేయడంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన మునిసిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల పది నుంచి నుంచి 14వ తేదీ వరకు పోటీలో ఉండే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు.

    15న స్క్రూట్నీ నిర్వహించడంతోపాటు అదేరోజు మునిసిపాలిటీల వారీగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్లను ఉపసంహరణ ఘట్టం 18వ తేదీ వరకు కాగా...  అనంతరం కీలక ప్రక్రియ పోలింగ్ 30వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ ఒకటో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే... ఏప్రిల్ రెండో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement