కోడ్ కూసింది | Similarly Assembly polls | Sakshi
Sakshi News home page

కోడ్ కూసింది

Mar 6 2014 12:57 AM | Updated on Oct 16 2018 2:49 PM

కోడ్ కూసింది - Sakshi

కోడ్ కూసింది

ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మహా సంగ్రామానికి తెర లేచింది. అభ్యర్థులు, పార్టీలు నిబంధనల లక్ష్మణ రేఖ దాటకుండా విధించిన ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది.

  • మోగిన ఎన్నికల నగారా
  •  అమల్లోకి ఎన్నికల నియమావళి
  •  రాజకీయపార్టీల ఫ్లెక్సీల తొలగింపు
  •  తొలిసారిగా ప్రత్యేక కమిటీలు
  •  సర్వసన్నద్ధమవుతున్న యంత్రాంగం
  •  ఫ్లయింగ్, స్టాటిక్ స్వ్కాడ్‌లకు మెజిస్టీరియల్ అధికారాలు
  •  ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మహా సంగ్రామానికి తెర లేచింది. అభ్యర్థులు, పార్టీలు నిబంధనల లక్ష్మణ రేఖ దాటకుండా విధించిన ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. దాంతో రాజకీయ పక్షాలకు ముకుతాడు వేసినట్టయింది. మే 7న జిల్లాలో జరగనున్న ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ విస్పష్ట ఆదేశాల ప్రకారం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక కమిటీలను సిద్ధం చేస్తోంది. ఎన్నికల వ్యయంపై, ప్రచారం తీరుతెన్నులపై నిఘా పెడుతోంది. శాంతిభద్రతలు చేజారకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. కొత్తగా వచ్చిన ఈవీఎంలతో పోలింగ్ ఏర్పాట్ల అధ్యాయం ప్రారంభమైంది.
     
    విశాఖ రూరల్, న్యూస్‌లైన్ :  సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మే 7న జరిగే ఎన్నికలకు మునుపెన్నడూ లేని విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల ఖర్చు నుంచి ఎన్నికల నియమావళి అమలు వరకు అన్నింటిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సిద్ధం చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసు శాఖ కూడాకట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
     
     కోడ్ ఉల్లం‘ఘనుల’పై దృష్టి
     ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో బుధవారం నుంచి కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పర్యవేక్షించడానికి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.
         
     మండల స్థాయిలో నియమావళి పర్యవేక్షణకు ఎంపీడీఓ, సబ్‌ఇన్‌స్పెక్టర్, ఒక వీడియోగ్రాఫర్, అర్బన్‌లో జోనల్ కమిషనర్ లేదా రిటర్నింగ్ అధికారి సిఫార్సు చేసే సిబ్బందిని నియమించనున్నారు.
         
     గ్రామీణ ప్రాంతంలో ప్రతీ 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ ఆఫీసర్‌ను, అలాగే అర్బన్‌లో ప్రతీ 20 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ ఆఫీసర్లను నియమించారు.
         
     వీళ్ల కింద గ్రామాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, అర్బన్‌లో వార్డుల్లో సబ్‌ఇన్స్‌పెక్టర్, శానిటరీ ఇన్స్‌పెక్టర్, బిల్‌కలెక్టర్లు నియమావళిని పర్యవేక్షిస్తారు.
         
     కోడ్ అమలుపై ఏఎస్పీ నుంచి సీఐల వరకు, ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు బుధవారం మధ్యాహ్నంతో శిక్షణ  కార్యక్రమాలు పూర్తయ్యాయి.
     
     జిల్లా స్థాయిలో కోడ్ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వరరెడ్డిని నియమించారు.
     బ్యానర్ల తొలగింపు: కోడ్ అమలులోకి భాగం గా జిల్లాలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు,బ్యానర్లు, హోర్డింగ్‌లను తొలగించే పని లో అధికారులు నిమగ్నమయ్యారు. గోడలపైన కూడా పార్టీలకు సంబంధించిన రాతలను కూడా చెరిపేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే హోర్డింగ్‌లను, బ్యానర్లను తొలగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాలోఎక్కడా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార పోస్టుర్లు లేకుం డా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
     
     తనిఖీ బృందాలు

     ఎన్నికల కోసం ప్రత్యేక తనిఖీ బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమిస్తున్నారు. ఇందులో ఒక అధికారి, సబ్‌ఇన్స్‌పెక్టర్, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ఓటర్లను ప్రభావితం చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు  వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ బృందాలు దాడులు చేసి చర్యలు తీసుకుంటాయి.
         
     అదే విధంగా ఒక్కో నియోజకవర్గానికి మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు, మద్యం, గిఫ్ట్‌లు, ఇతర వస్తువుల తరలింపులకు అవకాశం లేకుండా ఈ టీమ్‌లు ఎక్కడపడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ రెండు తనిఖీ బృందాలకు మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి.
         
     వీటితో పాటు జిల్లాలో 30 వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement