
భద్రాచలంపై ఆగని రగడ.. ఖమ్మంలో బంద్
భద్రాచలం డివిజన్ను తెలంగాణలో భాగంగానే ఉంచాలంటూ ఖమ్మం జిల్లావ్యాప్తంగా మంగళవారం బంద్ పాటిస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇన్నాళ్లూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న అంశంపైనే గొడవలు జరిగాయి. ఇప్పుడు దాన్ని భద్రాచలం మీదకి మళ్లించడంలో రాజకీయ నాయకులు సఫలమయ్యారు. భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ప్రభుత్వం తరఫున అధికారికంగా కేంద్ర మంత్రుల బృందానికి నోట్ ఇవ్వడంతో దీనిపై రగడ మొదలైంది. తెలంగాణ వాసుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను కూడా పూర్తిగా వాడుకోవడంతో ఇప్పుడు భద్రాచలం రగులుతోంది. భద్రాచలం డివిజన్ను తెలంగాణలో భాగంగానే ఉంచాలంటూ ఖమ్మం జిల్లావ్యాప్తంగా మంగళవారం బంద్ పాటిస్తున్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దుకాణాలు, విద్యాసంస్థలు మొత్తం మూతపడ్డాయి. నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి ఆర్టీసీ బస్సులను కదలకుండా నిలిపేశారు. పొరుగునున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే బస్సులను సైతం ఆపేశారు. ఆదివారం వరకు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 72 గంటల బంద్ పాటించారు. ఇప్పుడది మొత్తం జిల్లాకు పాకింది.
కోదండరాముడు కొలువై ఉన్న భద్రాచలం గోదావరి తీరంలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉండటంతో ఇది ఇరు ప్రాంతాల మధ్య వివాదానికి కారణమైంది. పైపెచ్చు, 1956కు ముందు ఇది ఆంధ్రప్రాంతంలోనే ఉండటం, పాలనాపరమైన సౌలభ్యం కోసం తర్వాత దీన్ని తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లా పరిధిలోకి తీసుకురావడంతో, 1956కు ముందున్న పరిస్థితి తేవాలంటే భద్రాచలాన్ని సీమాంధ్రలోనే కలపాలని అధికార యంత్రాంగం జీవోఎంకు నివేదిక ఇచ్చింది. కానీ భద్రాచలం డివిజన్ కుతుబ్ షాహీల పాలనలో ఉండేదని తెలంగాణ వాదులు అంటున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1825 నుంచి 1925 వరకు భద్రాచలం డివిజన్ మొత్తం సంయుక్త గోదావరి జిల్లాలో ఉండేదని ఆంధ్రా నాయకులు అంటున్నారు. జీవోఎంతో సోమవారం నాడు భేటీ అయిన తెలంగాణ మంత్రులు బలరాం నాయక్ లాంటి వాళ్లు ఈ అంశాన్ని అక్కడ కూడా లేవనెత్తారు.