షాక్ కొడుతున్న సెల్ చార్జర్లు | Shock removed the cell chargers | Sakshi
Sakshi News home page

షాక్ కొడుతున్న సెల్ చార్జర్లు

Dec 30 2013 2:16 AM | Updated on Sep 18 2018 8:38 PM

విద్యుత్ సరఫరాలో ఏర్పడ్డ సాంకేతిక లోపం గిరిజనులకు ప్రాణసంకటంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు...

 = విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం
 = యువకుని మృతి
 = ఏడుగురికి గాయాలు

 
కొలబరి(చింతపల్లి), న్యూస్‌లైన్ : విద్యుత్ సరఫరాలో ఏర్పడ్డ సాంకేతిక లోపం గిరిజనులకు ప్రాణసంకటంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన ఆ శాఖాధికారులు స్పందించకపోవడంతో సెల్ చార్జర్ షాక్ కొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు. వీరిలో 5 ఏళ్ల బాలికకు కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా కాలిపోయాయి. మండలంలోని కొమ్మంగి పంచాయతీ కొలబరి గ్రామంలో 90 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి.

కొద్దికాలంగా గ్రామంలోని కరెంట్ స్తంభాలకు విద్యుత్ సరఫరా అవుతూ ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. హై ఓల్టేజీతో ఇళ్లలోని బల్బులు పేలిపోతున్నాయి. లైటు వేసేందుకు స్విచ్ నొక్కినా, సెల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టే సమయంలో ఏ మాత్రం పిన్ను చేతికి తగిలినా షాక్ కొడుతోంది. ఈ సమస్య పరిష్కరించాలని రెండు వారాల క్రితం సర్పంచ్ పాంగి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సెల్ చార్జర్ షాక్ కొట్టడంతో సూరిబాబు (20) శుక్రవారం  మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. వంతాల లలిత అనే బాలిక సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్‌కొట్టి కుడిచేతి రెండు వేళ్లు పూర్తికా కాలిపోయాయి.
 
 ఆమెను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించాలని స్థానిక వైద్య బృందాలు సూచిం చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామంలోనే నాటు వైద్యం చేయిస్తున్నారు. వంతాల సుమ న్, ఎం.వెంకటరావు, కిల్లో సత్తిబాబు, పి.జ్యోతి షాక్‌కు గురయ్యారు. ఇప్పటికైన విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, గాయపడిన బాలికకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
 సమస్య పరిష్కరిస్తాం...
 
 కొలబరి గ్రామంలో విద్యుత్ సమస్య తమ దృష్టికి రాలేదని చింతపల్లి సబ్ స్టేషన్ ఏఈ సత్యనారాయణ ఆదివారం న్యూస్‌లైన్‌కు తెలిపారు. తమ సిబ్బందిని సోమవారం ఆ గ్రామానికి పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement