సీమలో పీఆర్పీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభ

సీమలో పీఆర్పీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభ


శోభా నాగిరెడ్డి... మంచి నాయకత్వ లక్షణాలున్న మహిళ. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ పీఆర్పీలో చేరారు. భారీ అంచనాలు ఉన్నా కూడా పీఆర్పీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసినా.. కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.



అందులోనూ రాయలసీమలో ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. ఆ ఒక్క స్థానంలో గెలిచిన ధీరవనిత.. శోభా నాగిరెడ్డి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి 61,555 ఓట్లు సాధించి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 1958 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో కేవలం 23800 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా రంగంలోకి దిగి మరీ ఓటర్లను బెదిరించారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నిధులు రావన్నారు. అయినా కూడా ఆమె దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి 88,697 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డికి 51,902 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో 20,374 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top