‘టీ’ బిల్లుపై నిరసనల వెల్లువ | Seemandhra leaders protests on T-bill | Sakshi
Sakshi News home page

‘టీ’ బిల్లుపై నిరసనల వెల్లువ

Dec 18 2013 5:11 AM | Updated on Sep 2 2017 1:42 AM

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

సాక్షి, కాకినాడ :  అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టి-బిల్లును నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన రెండ్రోజుల విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తొలిరోజు మూతపడ్డాయి. పలుచోట్ల విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్‌టీయూకే పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అలాగే టి-బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కాకినాడలో వివిధ శాఖల ఉద్యోగులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అసెంబ్లీలో టి-బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏలేశ్వరంలో విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మామిడికుదురులో సమైక్యాంధ్రకు మద్దతుగా వందలాది మంది విద్యార్థులు 216 జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ కో-ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, మండల కన్వీనర్ చంటిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో అన్నవరంలో గడపగడపకూ వైఎస్‌ఆర్ సీపీ సమైక్యనాదం పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి అన్‌ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్ (రూకా) ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు శ్యామలానగర్ రామాయలం సెంటర్ లో విద్యార్థి గర్జన  నిర్వహించారు.
 నక్సలిజం ధోరణిలో టి.ప్రజాప్రతినిధులు
 కాకినాడ సిటీ : తెలంగాణ ప్రజాప్రతినిధులు నక్సలిజం ధోరణిలో వ్యవహరిస్తున్నారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టి.బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై జరిపిన భౌతిక దాడులను నిరసిస్తూ వివిధ శాఖల ఉద్యోగులు మంగళవారం కాకినాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరం నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా.. తిరిగి కలెక్టరేట్ వరకు ర్యాలి చేపట్టారు. సమైక్యాంధ్ర నినాదాలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా టి.బిల్లు ప్రతులను, సోనియా, దిగ్విజయసింగ్ ఫ్లెక్సీలను దహనం చేశారు.

 జేఏసీ నాయకులు మాట్లాడుతూ చట్టసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై తెలంగాణ ప్రజాప్రతినిధులు భౌతిక దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి అసెంబ్లీలో మంత్రులు, శాసనసభ్యులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్‌లకు అమ్ముడుపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, వివిధ సంఘాల నాయకులు అనిల్ జాన్సన్, ఉదయ్‌భాస్కర్, ముల్లు సత్యనారాయణ మూర్తి, గెద్దాడ రామ్మోహన్‌రావు, పసుపులేటి శ్రీనివాస్, సరెళ్ల చంద్రరావు, కేఎస్‌వీ సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement