
వెలగపూడి లో సచివాలయం
గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ
తాత్కాలిక ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
♦ నేటి నుంచి టెండర్ల ఆహ్వానం
♦ 26 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
♦ ఫిబ్రవరి నుంచి పనులు...
♦ శాశ్వత రాజధాని నిర్మాణం జూన్ నుంచి ప్రారంభం
♦ టెండర్ ద్వారానే నిర్మాణ సంస్థల ఎంపిక
♦ మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెలగపూడిలోని 205, 206, 207, 208, 214 సర్వే నంబర్లలో తాత్కాలిక సచివాలయం వస్తుందని చెప్పారు. 26 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. నిర్మాణానికి ప్రీ ఫ్యాబ్రికేటెడ్, స్టీల్, ఆర్‌సీసీ విధానాల్లో టెండర్లను గురువారం నుంచి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.180 కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్టీల్ నిర్మాణం అయితే రూ.300 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు.
టెండర్ దాఖలుకు 21 రోజుల సమయం ఇస్తామన్నారు. అనంతరం ఐదు రోజుల్లో టెండర్‌ను ఖరారు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఫిబ్రవరిలో ప్రారంభమై ఆరు నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. 2018లోగా రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెపుతుండగా తాత్కాలిక సచివాలయం ఎందుకనే ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ... బహుళ ప్రయోజన డిజైన్‌తో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఇప్పుడు సచివాలయం కోసం వినియోగించుకున్న తరువాత సీఆర్‌డీఏ వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటుందని చెప్పారు.
మార్చి నుంచి రైతులకు ప్లాట్లు
కోర్ కేపిటల్ వచ్చే తాళ్లాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం ప్రజలకు పక్క గ్రామాల్లో స్థలాలు ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రెసిడెన్షియల్ నిర్మాణం, వాణిజ్య నిర్మాణ జోన్‌లు వేర్వేరుగా ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్ధారించిన డిజైన్లలోనే నిర్మాణాలు ఉండాలని, అలాగే రెసిడెన్షియల్ జోన్లలో వ్యాపార కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఎక్కడ ప్లాట్లను కేటాయించేది ఫిబ్రవరి 1న ప్రకటిస్తామన్నారు. మార్చి నుంచి రైతులకు ఇళ్లు, వాణిజ్య ప్లాట్లను ఇస్తామన్నారు.
వారికి ప్లాట్లు ఇచ్చిన తరువాతే రాజధాని భూమి సీఆర్‌డీఏ పరం అవుతుందని పేర్కొన్నారు. శాశ్వత రాజధాని నిర్మాణ పనులు, సర్కారు భవనాల నిర్మాణాలను జూన్ నుంచి చేపడతామన్నారు. సచివాల యం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు టెండర్ ద్వారానే నిర్మాణ సంస్థలను ఎంపిక చేస్తామని చెప్పారు. సర్కారు భవనాలను సింగపూర్ సంస్థలు నిర్మించబోవని, వాణిజ్య, వ్యాపార సముదాయాలనే నిర్మిస్తాయని వివరించారు. ఎల్‌అండ్‌టీ హైటెక్ సిటీని నిర్మించిన తరహాలోనే సింగపూర్ సంస్థలు వాణిజ్య, వ్యాపార సముదాయాలను నిర్మిస్తాయన్నారు. అమరావతి నిర్మాణంలో పాల్గొనేం దుకు చైనా సంస్థలు ముందుకు వచ్చాయని, అయితే నిర్దిష్టంగా ఏ పనులు చేపడతాయనేది ఇంకా తేలాల్సి ఉందని మంత్రి తెలిపారు.