సీట్ల యవ్వారం..సీఎం దగ్గర బేరం!

Seat Issues Of TDP In Ongole - Sakshi

రాజధానిలో కొలిక్కిరాని దేశం నేతల పంచాయితీ

‘శిద్దా’ దర్శిలోనే ఉండాలంటూ సీఎం నివాసం వద్ద నిరసన

దర్శికి వెళ్లేందుకు ‘ఉగ్ర’ విముఖత

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  టీడీపీలో సీట్ల పోట్లాట అమరావతికి చేరింది. మంత్రి శిద్దా రాఘవరావును దర్శి నుంచే పోటీ చేయించాలంటూ శిద్దా అనుచరులు గురువారం సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగారు. శిద్దాకు ఎంపీ సీటు వద్దని, ఎమ్మెల్యే సీటు కావాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే తాము పార్టీని వదిలేందుకు సైతం సిద్ధమంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద ఎద్దున శిద్దా అనుచరులు పాల్గొన్నారు. శిద్దా అనుచరులు ఏకంగా సీఎం ఇంటి ముందే ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శిద్దాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హుటాహుటిన సీఎం ఇంటివద్ద ఉన్న అనుచరులను అక్కడి నుంచి పంపించారు.

మంత్రి శిద్దాతో పాటు ఆయన కుటుంబం ఒంగోలు పార్లమెంట్‌ సీట్‌ కంటే దర్శి నుంచి పోటీకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సీఎం ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయనకు ఎదురు చెప్పలేక శిద్దా మౌనంగా ఉండిపోయారు. సీఎం ఆదేశం మేరకు శిద్దా ఒంగోలులో పోటీ చేసేందుకు సిద్ధపడినా దర్శి నుంచి పోటీచేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. సామాజిక సమీకరణాల పరంగా తొలుత కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి పంపాలని సీఎం నిర్ణయించారు. అయితే ఇందుకు కదిరి బాబూరావు ససేమిరా అన్నట్లు సమాచారం. పైగా తనకు సన్నిహితుడైన చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ద్వారా కనిగిరి సీటు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

మరోవైపు కనిగిరి సీటును ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తానని తొలుత సీఎం మాట ఇచ్చారు. అయితే కదిరి బాబూరావు అంగీకరించకపోవడంతో అది వీలుకాలేదు. దీంతో దర్శికి వెళ్లాలని సుజనా చౌదరి, ముఖ్యమంత్రి.. ఉగ్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఎక్కడికైనా వెళ్తానని చెప్పిన ఉగ్ర అంతలోనే వెనక్కు తగ్గి కనిగిరి సీటు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎంకు స్పష్టం చేశారు. దీంతో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ పరిణామం శిద్దాకు అనుకూలాంశంగా మారింది. ఇదే అదనుగా శిద్దా అనుచరగణం సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగానే గురువారం సీఎం ఇంటి వద్ద ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శి సీటు శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్‌కు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యమంత్రి గురువారం జిల్లా టీడీపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఒంగోలు పార్లమెంట్‌తో పాటు దర్శి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉంటుందని శిద్దా చెప్పినట్లు తెలుస్తోంది.

ఉగ్రకు బంపరాఫర్‌
దర్శి నుంచి పోటీ చేస్తే మొత్తం తానే చూసుకుంటానని ముఖ్యమంత్రి ఉగ్రనరసింహారెడ్డికి బంపరాఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. కనిగిరికైతే తానే డబ్బులు పెట్టుకోగలనని దర్శికి డబ్బులు పెట్టడం ఇబ్బంది అని  ఉగ్ర సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. దర్శికి వెళ్లేవారు కనిపించకపోవడంతో అన్నీ తానే చూస్తానని  ఉగ్రకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్ర దర్శికి వెల్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు కనిగిరి సీటు ఎవరికివ్వాలన్నదానిపై స్పష్టత కరువైంది. బాలకృష్ణ ఒత్తిడి మేరకు కనిగిరి సీటు కదిరి బాబూరావుకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఉగ్రనరసింహారెడ్డి సైతం పోటీ పడుతుండటంతో చివరకు ఏం జరుగుతుందన్నది తెలియరావడం లేదు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top