స్కూల్ వ్యాన్ బోల్తా | School van roll over, ten students are injured | Sakshi
Sakshi News home page

స్కూల్ వ్యాన్ బోల్తా

Oct 19 2014 1:07 AM | Updated on Sep 2 2017 3:03 PM

స్కూల్ వ్యాన్ బోల్తా

స్కూల్ వ్యాన్ బోల్తా

ఓ స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఒక స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడిన సంఘటన మర్రిపూడి మండలంలో శనివారం జరిగింది. చెంచిరెడ్డిపల్లి నుంచి 54 మంది విద్యార్థులతో బయలుదేరిన స్కూల్‌వ్యాన్  ఆర్‌కే పల్లి రోడ్డు నుంచి టంగుటూరు-పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా బోల్తాపడింది.
 
మర్రిపూడి : ఓ స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద శనివారం జరిగింది. వివరాలు.. పొదిలికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ మండలంలోని చెంచిరెడ్డిపలి ్లనుంచి బయల్దేరి కూచిపూడి, అంకేపల్లి గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని పొదిలి బయల్దేరింది. ఆ సమయంలో వ్యాన్‌లో సుమారు 54 మంది విద్యార్థులు ఉన్నారు.

అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేయకుండా డ్రైవర్ వీరారెడ్డి పరారయ్యాడు. విద్యార్థుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏడుపులు.. కేకలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వ్యాన్ అద్దాలు పగుగొట్టి విద్యార్థులను బయటకు తీశారు.

గాయపడిన పాలుగుండ్ల శ్రీజ, రామిరెడ్డి, బోదా మధు, యూ.సుదర్శ్‌న్‌రెడ్డి, దామిరెడ్డి సింహాద్రి, బాదం శైలజతో పాటు మరో ముగ్గురు విద్యార్థులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నపూస సురేష్‌కు చెయ్యి గూడ జారింది. పాలుగుండ్ల శ్రీజ కాలుకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. వ్యాన్ బోల్తాపడిన ప్రదేశంలో మైలురాయి అడ్డుపడటంతో ప్రాణాపాయం తప్పింది. పర్లంగ్ రాయిలేకుంటే వ్యాన్ మరో రెండుమూడు పల్టీలు కొట్టి లోతైన గుంతలో పడేదని, ప్రాణ నష్టం కూడా జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సై బీవీవీ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement