సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీఓ నంబర్ 431ను, నిధులు ఖర్చు చేసేందుకు తగు సూచనలు చేస్తూ జీఓ నంబర్ 432ను బుధవారం రాత్రి విడుదల చేసింది.
నెల్లూరు (టౌన్), న్యూస్‌లైన్: సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీఓ నంబర్ 431ను, నిధులు ఖర్చు చేసేందుకు తగు సూచనలు చేస్తూ జీఓ నంబర్ 432ను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ జూలై నెలాఖరులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జాయింట్ చెక్‌పవర్‌ను సర్పంచ్‌లు జీర్ణించుకోలేక పోయారు. తమ అధికారాలను కాలరాసిన ప్రభుత్వంపై అధికారులు మండిపడ్డారు. తమకు మాత్రమే చెక్‌పవర్ ఉండాలని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చారు.
అంతలోనే సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో సర్పంచ్‌లు కూడా ఏమి చేయలేక కొంతకాలం ఎదురు చూశారు. సమ్మె ముగియడంతో తిరిగి ప్రభుత్వంపై సర్పంచ్‌లు చెక్‌పవర్ కోసం ఒత్తిడి పెంచారు. గత ఎన్నికల ముందు తమకు మాత్రమే ఉన్న చెక్‌పవర్‌ను రద్దు చేసి పంచాయతీ కార్యదర్శులతో కలిపి జాయింట్ చెక్‌పవర్ కల్పించడమేమిటని నిలదీశారు. అంతేకాక పలు గ్రామాల్లో సర్పంచ్‌లు ఉమ్మడి చెక్‌పవర్ సర్క్యులర్‌లపై సంతకం చేయకుండా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూడసాగారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిధులు డ్రా చేసే పరిస్థితి లేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చి సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్‌ను పునరుద్ధరించింది.