పగబట్టిన భర్త

Sarpanch Anjali Bai Sorrows To Her Husband Harassments Anantapur - Sakshi

ప్రజాప్రతినిధికే  విలువ కరువు

భర్త వేధింపులు..అవమానాలే ఆభరణాలు

చెదిరిన ‘దర్జా’ జీవితం పిల్లలకు వైద్యం చేయించలేని దుస్థితి

స్త్రీలకు సమానత్వం కల్పించాలి.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని.. దశాబ్ధాలుగా పోరాటాలు జరుగుతున్న ఫలితం లేకుండా పోతోంది. ప్రధానంగా రాజకీయ ఉన్నతిలో అడుగడునా వారికి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రజాప్రతిధిగా ఉన్నా పురుషాధిక్యతకు తలొగ్గాల్సిందే. ఇలా పురుషాధిక్యత మాటున అణచివేతకు గురైన ధర్మవరం నియోజకర్గం ముదిగుబ్బ మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ డి.అంజలిబాయి ‘దీక్ష కథ’ ఇందుకు దర్పణం పడుతోంది.

అనంతపురం అర్బన్‌: మొన్నటి వరకు దర్జాగా బతికిన ఆమెపై విధి భర్త రూపంలో పడగవిప్పింది. దీనికి అధికారులు తొడవడంతో పదవిలో ఉన్న ఆమెకు అవమానాలు... చీత్కారాలు .... బెదిరింపులే ఆభరణాలయ్యాయి. ప్రజాప్రతినిధిగా కనీస విలువ లేకుండా పోయింది. భర్తకు దూరంగా తన ఇద్దరి పిల్లలతో ఏకాకిలా బిక్కుబిక్కుమంటూ అనంతపురం నగరంలో జీవితం గడుపుతోంది. పిల్లల ఫీజులు కట్టలేక, వైద్యం చేయించలేకపోవడంతో పాటు కట్టుకున్నవాడు పట్టించుకోకపోవడంతో దీనావస్థలో కాలం వెళ్లదీస్తోంది. దీక్ష బాధ ఆమె మాటల్లోనే...

ప్రేమించి పెళ్లిచేసుకున్నాం
మాది ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మేజర్‌ పంచాయతీ. నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. మాది ప్రేమ వివాహం. నేను ప్రేమించిన ఐ.తిరుపాల్‌తో 2002లో వివాహమైంది.  ఇద్దరు సంతానం పెద్దబ్బాయి జయంత్‌నాయక్, చిన్నబ్బాయి గౌతమ్‌ గంభీర్‌నాయక్‌. ఏసీ బంగ్లా... ఏసీ కారు... సంసారం హాయిగా సాగిపోతూ వచ్చింది. 2013 ఎన్నికల్లో ముదిగుబ్బ మేయర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. దీంతో గృహిణిగా ఉన్న నేను నా ¿భర్త సూచన మేరకు ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేశాను. ఎన్నికలకు డబ్బులు అవసరమంటూ నా పేరున ఉన్న ఇంటిని నా భర్త రూ.20 లక్షలకు కుదవ పెట్టించాడు. ఎన్నికల్లో గెలుపొందాను. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి.

కలెక్టర్‌కి ఫిర్యాదు చేశా
నా సంతకాన్ని నా భర్త ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు లక్షల రూపాయలు డ్రా చేయడంపై కలెక్టర్‌ 2018, మార్చి 21న కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీపీఓ విచారణ చేయించారు. అయితే అదంతా మొక్కుబడిగా జరిగింది. ఇదేమని డీపీఓని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. 

నా పేరున పాలసీ తీసుకున్నాడు
ప్రాణహాని భయంతో  భర్త నుంచి దూరంగా ఉంటూ తరువాత నా పేరున రూ.20 లక్షలకు ఆయన పాలసీ (మాస్టర్‌ప్లాన్‌– 1542–0000–00) తీసుకుని ప్రీమియం చెల్లించాడు. ఎందుకు తీసుకున్నావని అడిగితే... నీవు చస్తే నాకు ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా అన్నాడు. అప్పటి నుంచి నేను భయం భయంగా ఉంటున్నాను.

ఎలా బతకాలో తెలియడం లేదు
నాకు 14 నెలలుగా గౌరవ వేతనం నిలిపివేశారు. ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలో తెలీడం లేదు. ఒకవైపు పిల్లల స్కూల్‌ ఫీజు కట్టేందుకూ డబ్బులు లేవు. పెద్దబ్బాయి జయంత్‌ నాయక్‌కు ముక్కు ఆపరేషన్‌ చేయించాలి. పిల్లలకు జ్వరం వచ్చి పడిపోయినా పట్టించుకోడు. డబ్బులు ఇవ్వాలని నా భర్తను అడిగితే పంచాయితీ పెడతావా నిన్నెవరూ కాపాడలేరు... నేను చెప్పినప్పుడు వచ్చి చెప్పిన చోట సంతకం చేయాలని అంటున్నాడు.

కలెక్టర్‌ స్పందిస్తేనే న్యాయం
నా కష్టాలు తీరాలంటే కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలి. సర్పంచ్‌గా నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధుల స్వాహా చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. నాకు వేతనం వచ్చేలా చూడాలి. నా ఇంటిని కుదవ నుంచి నా భర్త విడిపించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నాకు ఏదైనా ఉపాధి చూపించాలి.

నా భర్తే శత్రువయ్యాడు
నాకు నా భర్తే శత్రువగా మారాడు. ఆయనకు వేరొక మహిళతో చాలా ఏళ్లగా సంబంధం ఉన్న విషయం తెలిసింది. ఈ విషయంపై గొడవ జరిగింది. అప్పటి నుంచి నాకు వేధింపులు అధికమయ్యాయి. దీంతో 2017 జనవరిలో నా ఇద్దరు కుమారులతో ఆయన నుంచి దూరంగా వచ్చేసి అనంతపురం నగరంలో ఉంటున్నాను. అలా వచ్చేసినా ఆయన ఫోన్‌ మెజేస్‌ల ద్వారా వేధించడం మానలేదు. మరోవైపు సర్పంచ్‌గా నాకు పంచాయతీ కార్యాలయంలో విలువ లేకుండా చేశాడు. తానే సర్పంచ్‌గా వ్యవహరిస్తూన్నాడు. ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారు. విలాసాలకు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. పిల్లల స్కూల్‌ ఫీజుకు డబ్బులు ఇవ్వడు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా డబ్బులు పంపడు.

సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాడు
పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేశామంటూ నిధులు స్వాహాకు సిద్ధపడ్డారు. నా సంతకాన్ని నా భర్త పోర్జరీ చేసి లక్షల రూపాయలు నిధులను డ్రా చేశాడు. పంచాయతీ తీర్మానాల పత్రాల్లో నా సంతకాలను పోర్జరీ చేస్తూనే ఉన్నాడు. ఇదేమి అడిగితే నేనే సర్పంచ్‌ని... నీ సంగతి చూస్తానంటూ ఫోన్‌లో మెసేజ్‌లు పెడుతున్నాడు. ఆయన ఒక హత్యకేసులో నిందితునిగా ఉంటూ బెయిల్‌ తెచ్చుకున్నాడు. నన్ను కూడా చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఉన్నతాధికారులు, అధికార పార్టీ పెద్దలకు విషయం తెలిసినా పట్టించుకోకపోగా నా భర్తకు వత్తాసుగా నిలిచి ఈ కుట్రలో భాగస్వాములయ్యారు.  ఎన్నికలప్పుడు నా ఇల్లు కుదవ పెట్టి తెచ్చుకున్న రూ.20 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగితే, నాపైనే దుష్ప్రచారం ప్రారంభించాడు. పనులకు పర్సంటేజీ అడుగుతున్నానని అందరికీ చెబుతున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top