ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు | Sand Mafia supporting fire | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు

Aug 10 2014 12:20 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు - Sakshi

ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు

జిల్లాలో ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించేందుకు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సిద్ధమయ్యారు.

రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ
 సాక్షి, గుంటూరు:
జిల్లాలో ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించేందుకు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ  సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్‌లు ఉన్న పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు.  ఇసుక అక్రమ రవాణాకు సహకరించినా, అరికట్టడంలో అలసత్వం వహించినా పోలీసు అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
 రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు..ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
     
ఇప్పటికే దాడులు నిర్వహించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, లారీలు, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నాం. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొల్లిపర ఎస్సై ప్రభాకర్‌ను వీఆర్‌కు పిలిచాం.
శాంతి భద్రతల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తా, పోలీసుల వైఫల్యం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటా. లాటరీ, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలకు వెనుకాడం.
పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం.. రూరల్ పరిధిలో సిబ్బంది కొరత వల్ల పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, తొలిసారిగా సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు మంజూరు చేస్తున్నా. స్టేషన్‌లోని సిబ్బందిని బట్టి రోజుకు ముగ్గురు, నలుగురు చొప్పున సెలవు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చా.
‘వారథి’ కార్యక్రమం ద్వారా సిబ్బందికి ఉండే పాలనాపరమైన సమస్య లు తెలుసుకునేందుకు ఒక సీఐతో టీమ్‌ను ఏర్పాటు చేసి ఎస్‌ఎంఎస్ సౌకర్యం కల్పించాం.
సిబ్బంది నిత్యవసర వస్తువులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు త్వరలో  గురజాలలో పోలీసు సబ్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదే తరహాలో నరసరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి, తెనాలిలలో కూడాఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 20 నుంచి 40 శాతం రాయితీతో నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తాం.
కోర్టు ద్వారా  ఉత్తర్వులు తెచ్చుకున్న 15 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవడం లేదు. మేం కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తాం.

 ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం ...
జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఫ్యాక్షన్‌కు పాల్పడు తున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు జిల్లా రూరల్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ తెలిపారు.
గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు.
గొడవలకు పాల్పడేవారిని గుర్తించి తమదైన పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికే ఆయా ప్రాంతాల పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement