అమరారామంలో సమైక్యధ్వనులు | Sakshi
Sakshi News home page

అమరారామంలో సమైక్యధ్వనులు

Published Tue, Feb 11 2014 1:25 AM

samaikya sankharavam in Amravati

అమరావతి,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్  పెదకూరపాడు నియోజకవర సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన సమైక్యశంఖారావం సభలో పార్టీ శ్రేణులు, ప్రజలు చేసిన సమైక్య నినాదాలతో అమరావతి ప్రతిధ్వనించింది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రెహమాన్ మాట్లాడుతూ హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు  కాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు గోడ మీద పిల్లి లాంటివారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ఏంతో అవసరమన్నారు. ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్, తెలుగుదేశ కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. ముస్లింలకు మేలు చేసిన రాజన్న పాలన రావాలంటే జగన్‌ను గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రం ఇంత దారుణంగా ఉండేది కాదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దేశ,రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడన్నారు. 
 
 తెలుగుదేశం పార్టీకి సిద్దాంతం లేదన్నారు. ఎన్‌టీఆర్ ఆశయాలను చంద్రబాబు పక్కన బెట్టడంతోనే తనలాంటి వారు ఆ పార్టీని వీడారని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కేవలం పదవుల కోసమే ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు విభజనను అడ్డుకోలేదన్నారు. నాలుగు నెలల క్రితం వారంతా  రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలుగుదేశం కూడా విభజనకు అనుకూలంగా మారటంతో విభజన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసిందన్నారు. ఎన్నికలు రెండు నెలల్లో వస్తాయని ముఖ్యమంత్రి రాజీనామా డ్రామాలు అడుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం కేవలం సమైక్య డ్రామా అడుతుందన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. నిత్యం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సమైక్యం కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
 
 నియోజకవర్గ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ సీసీ చేతల పార్టీ అని అన్నారు. తాను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాన న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, రావి వెంకటరమణ,  లేళ్ల అప్పిరెడి,్డ నసీర్ అహ్మద్, షౌకత్, కోన రఘుపతి, నన్నపనేని సుధ, రాష్ట్ర పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష,  నాయకులు నర్సిరెడ్డి, మంగిశెట్టి కోటేశ్వరరావు, బెల్లంకొండ మీరయ్య, మర్రి ప్రసాదరెడ్డి, సందెపోగు సత్యం, షేక్ మస్తాన్, పులివర్తి రత్నబాబు, కంచేటి సాయిబాబు, పానెం హనిమిరెడ్డిలతోపాటు విజయవాడకు చెందిన నాయకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 పార్టీలో చేరిక..  కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంబాబు నాయకత్వంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు పార్టీకండువాలు కప్పి సాదరంగా  అహ్వానించారు. 
 

Advertisement
Advertisement