వైఎస్సార్‌ అక్షయ పాత్ర!

Salary Rises Midday Meal Scheme Workers - Sakshi

ఇక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం

నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సీఎం ఆదేశం

మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు

వేయి రూపాయల నుంచి మూడు వేలకు పెంచిన కొత్త ప్రభుత్వం

లబ్ధి పొందనున్న 5,654 మంది వంట సహాయకులు

విద్యార్థుల హాజరు పెంచటంతో పాటు వారు ఆరోగ్యకరంగా జీవించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యమైన సమయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ‘వైఎస్సార్‌ అక్షయ పాత్ర’పేరిట విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. పరిశుభ్ర వాతావరణం ఉండేలా చేయాలని అధికారులను ఆదేశించారు.

సాక్షి, అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎంతో ప్రాధాన్యత గల విద్యా శాఖపై సమీక్ష నిర్వహించటం ద్వారా వైఎస్‌ జగన్‌ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెంచటంతో పాటు స్కూల్‌లో చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. పౌష్టికాహారం తీసుకోవటం వల్ల శారీరకంగా ధృడంగా మార్చటంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో నాణ్యమైన భోజనం అందించటంలో పూర్తిగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గౌరవ వేతనం పెంపు..
మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకుల గౌరవ వేతనాన్ని ఇప్పుడిస్తున్న వేయి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలలో పని చేస్తున్న 5,654 సహాయకులు లబ్ధి పొందనున్నారు. జిల్లాలో 3,157 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అందులో జిల్లావ్యాప్తంగా 2,53,798 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మ«ధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.56.54 లక్షలు చెల్లిస్తుండగా, తాజా నిర్ణయంతో నెలకు రూ.1.69 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అక్షయ పాత్ర సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకోనున్నారు. భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు ఇవ్వకపోవటంతో తీవ్ర కష్టాల్లో ఉన్నారు.  

జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న పాఠశాలలు    3,157
జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య    2,61,411 మంది
జిల్లాలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య    2,53,798 మంది
జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు    3,157
జిల్లాలో ఏజెన్సీలలో పని చేస్తున్న వంట సహాయకులు    5,654 మంది
నెలకు సహాయకులకు చెల్లిస్తున్న గౌవరవ వేతనం    రూ.56.54 లక్షలు
పెరిగిన మొత్తంతో సహాయకులకు నెలకు చెల్లించే సొమ్ము    రూ.1.69 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top