విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్‌పై ఓ కేసులో నిందితులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్, మరో విలేకరి ఎం.సోమరాజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక కేంద్ర కారాగారం వద్ద ఉన్నారు.
సాక్షి, రాజమండ్రి : విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్‌పై ఓ కేసులో నిందితులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్, మరో విలేకరి ఎం.సోమరాజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక కేంద్ర కారాగారం వద్ద ఉన్నారు. దినచర్యలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జైలు ముందుండగా, కొందరు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. ఎక్కువ మంది ఉండడంతో వారు ప్రధాన కేసులో నిందితులనే భావంతో ఫొటోలు తీసేందుకు సోమరాజు, ప్రసాద్‌లు ముందుకు వచ్చారు. పోలీసు వాహనం దిగిన నిందితులు వెనువెంటనే ఆ ఇద్దరిపై దాడి చేశారు. గరగ ప్రసాద్‌ను దారుణంగా కొట్టారు. కెమేరా లాక్కుని, అనుచిత పదజాలంతో దూషించారు. కెమేరాను జైల్లోకి తీసుకుపోయారు. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడంతో వారిద్దరూ భయభ్రాంతులకు గురయ్యారు. జైలు అధికారుల సాయంతో కెమేరాను బయటకు రప్పించగలిగినా, విలువైన ఫొటోలున్న మెమొరీ కార్డులను మాత్రం నిందితులు తస్కరించి, సాయంగా వచ్చిన తమ వారితో మాయం చేశారు.
కుట్రపూరిత దాడి
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణపై ఉప్పాడ వద్ద జరిగిన దాడి కేసులో ఈ నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న ఈ ఏడుగురిని రిమాండుకు తరలిస్తుండగా, ‘సాక్షి’ పాత్రికేయులు తారసపడగానే.. సహచరులతో గుర్తుపట్టి.. ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఈ దాడిని పాత్రికేయులు తీవ్రంగా ఖం డించారు. అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తిని కలిసి సంఘటనను వివరించారు. దాడికి బాధ్యులైన వారిని వదిలేది లేదని ఎస్పీ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ బందన సురేష్, బందన రమణ, బందన నందీప్, వేలుగు సూరిబాబు, ఉమ్మిడి బాగర్తి, కారె పెంటయ్య, మెరుగు కృష్ణలతో పాటు వీరికి సాయంగా వచ్చి, దాడికి పాల్పడ్డ మరికొందరిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు సీఐ కేటీవీ రమణారావు తెలిపారు.ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి ఈ దాడిని ఖండించారు.