అసహాయులకు  ఆలంబన

Sakshi Phone In Program With Police Commissioner Visakha City

‘సాక్షి’ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌ ఇన్‌

అద్భుత స్పందన.. 

నిరంతరాయంగా కాల్స్‌

63 మందితో ఫోన్‌లో సంభాషించిన మీనా

ట్రాఫిక్, మందుబాబుల ఆగడాలపై ఎక్కువ ఫిర్యాదులు

స్పష్టమైన హామీలు

సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): మహా నగరంలో తలెత్తుతున్న శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో చెప్పుకునేందుకు శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 63 మందికి తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు చెప్పుకునే అవకాశం వచ్చింది. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు ఆదేశాలిస్తానని, కొన్నింటిని తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని, అన్ని సమస్యలకూ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పరిష్కారం చూపుతానని కమిషనర్‌ హామీ ఇచ్చారు.

ఫిర్యాదు: తెలిసీతెలియని వయసులో చిన్నచిన్న దొంగతనాలు చేసిన పాపానికి పెద్ద అయిన తర్వాత ఉద్యోగానికి నోచుకోకుండా పోలీసులు వేధిస్తున్నారు. నాపై చిన్నప్పుడు కేసులు ఉండటంతో ఇప్పుడు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా.. పోలీసుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని రమ్మంటున్నారు. చిన్నప్పుడు నీపై కేసు నమోదైంది కాబట్టి ఇవ్వలేం అని పోలీసులు అంటున్నారు. నా జీవితం అంధకారంలో పడింది. 
– ఎన్‌.రాజేష్, అనకాపల్లి
పోలీసు కమిషనర్‌(సీపీ): మీరు నేరుగా కార్యాలయానికి వచ్చిన నన్ను కలవండి. మీకు కచ్చితంగా న్యాయం చేస్తా..

ఫిర్యాదు: విశాఖ ఐ ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాలు నిలిపివేస్తున్నారు. దీని వలన ట్రాఫిక్‌ జామ్‌ అయి, వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు.
– ప్రకాశరావు, ఎంవీపీకాలనీ
సీపీ: సిబ్బందిని పంపించి రోడ్డుపై వాహనాలు పార్కింగ్‌ చేయకుండా చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు. ఇదే విషయమై మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. పిల్లలున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– సత్యవతి, పెదవాల్తేరు
సీపీ: మీ భర్తకు కౌన్సెలింగ్‌ ఇవ్వమని మూడో పట్టణ పోలీసులకు ఆదేశిస్తాను. 

ఫిర్యాదు: నా స్నేహితుడు నా పేరు మీద పర్సనల్‌ లోన్‌ తీసుకున్నాడు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గాజువాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 
– అరుణ్‌ కుమార్, గాజువాక
సీపీ: ఆధారాలతో సోమవారం కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయండి. మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: కంచరపాలెం ప్రభుత్వ స్కూల్‌ వద్ద రాత్రుళ్లు మందుబాబులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కొంత మంది యువకులు మద్యం మత్తులో స్కూల్‌ గోడలను నాశనం చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
– అరుణ్‌బాబు, కంచరపాలెం
సీపీ: వెంటనే ఎస్‌ఐను పంపించి మందు బాబులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: స్మార్ట్‌ సిటీ అయిన నగరంలో మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా వెల్డింగ్, కిరాణా షాపులు నడుపుతున్నారు. దీని వలన వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 
–మోహన్‌రావు, సీతమ్మధార
సీపీ: ఎప్పటికప్పుడు మెయిన్‌ రోడ్డుపై ఎలాంటి కిరాణా షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీతమ్మధార ప్రాంతాన్ని కూడా పరిశీలించాలని ట్రాఫిక్‌ సిబ్బందిని ఆదేశిస్తాను.

ఫిర్యాదు: నక్కవానిపాలెం ప్రాంతంలో కొంత మంది రహస్యంగా మద్యం విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో మందుబాబులు గొడవలు సృష్టిస్తున్నారు. 
– నాగేశ్వరరావు, నక్కవానిపాలెం
సీపీ: మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి పూర్తి వివరాలు తీసుకుంటారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: ఈ మధ్య కాలనీల్లో నేరాలు ఎక్కువవుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే పూర్తిగా ఏర్పాటు చేసినా ఫర్వాలేదు. అలా కాని పక్షంలో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తే.. కాలనీ ప్రజలే మిగతా మొత్తంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి బాగుంటుంది. 
– రవి కుమార్, విశాలక్షినగర్‌
సీపీ: ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తాం.

ఫిర్యాదు: తాటిచెట్లపాలెం నుంచి కైలాసపురం రోడ్డు మార్గం చాలా చిన్నగా ఉంటుంది. ఈ రోడ్డుపైనే సాయంత్రం సమయంలో షాపులు పెడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.
–ప్రసాద్, కైలాసపురం
సీపీ: ట్రాఫిక్‌ సిబ్బందిని పంపించి రోడ్డుపై షాపులు లేకుండా చూస్తాం.

ఫిర్యాదు: అక్కయ్యపాలెం, రామచంద్రనగర్‌లో నా భార్య పేరు మీద ఇల్లు స్థలం కొనుగోలు చేశాను. అయితే ఆ స్థలాన్ని ఆక్రమించుకుని భవనం నిర్మణం చేస్తున్నారు. ఇదే విషయమై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. 
– కృష్ణారావు, హైదరాబాద్‌ 
సీపీ: ఆధారాలతో సోమవారం వచ్చి కార్యాలయంలో నన్ను కలవండి. ఆధారాలు పరిశీలించి మీకు న్యాయం జరిగేలా చూస్తా.

ఫిర్యాదు: కంచరపాలెం కప్పరాడ రోడ్డు మార్గంలో ఉదయం, సాయంత్రం ఆటోలు నిలిపివేస్తున్నారు. దీని వలన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 
– శ్రీధర్, కంచరపాలెం
సీపీ: మా సిబ్బందిని పంపించి రోడ్డుపై వాహనాలు లేకుండా చేస్తాం.

ఫిర్యాదు: దొండపర్తిలోని వెంకటరాజునగర్‌లో రాత్రి పూట యువకులు మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నాం.
– పార్వతి, దొండపర్తి 
సీపీ: వెంటనే సిబ్బందిని పంపిస్తా. మద్యం సేవించి మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేస్తాం.

ఫిర్యాదు: విశాలక్ష్మినగర్‌లో భవనం యాజమాని ఎం.నారాయణమ్మ, ప్రతాప్‌సింగ్‌లు జాతీయ జెండాను కింద పడేశారు. ఎందుకు జెండాను కింద పడేశారు అని అడిగితే గొడవకు దిగారు. 
– వై.రామన్, విశాలాక్షినగర్‌ 
సీపీ: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: హనుమంతవాక జంక్షన్‌ నుంచి ఆరిలోవ లోపలకు వెళ్లే మార్గంలో ఆటోలు అడ్డంగా పెడుతున్నారని అడిగితే డ్రైవర్లు తిరగబడ్డారు. అక్కడే ఉన్న ఏఎస్‌ఐకు చెబితే ఆటో డ్రైవర్ల తరఫున మాట్లాడారు. 
–విద్యాసాగర్, హనుమంతవాక జంక్షన్‌
సీపీ: ఆరిలోవ పోలీస్‌ సిబ్బందితో చర్చించి చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: జ్ఞానాపురం జంక్షన్‌లో ఇరువైపులా ఆటోలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. తక్షణమే కానిస్టేబుల్‌ను నియమించి చర్యలు తీసుకోవాలి. 
– డాక్టర్‌.శ్యామలరావు, జ్ఞానాపురం
సీపీ: జ్ఞానాపురంలో పర్యటించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కారిస్తాం.

ఫిర్యాదు: వీఎస్‌ కృష్ణ కళాశాల సమీపంలో ఆటోమోటివ్‌ జంక్షన్‌ వద్ద వాహనాలను చాలా వేగంగా నడుపుతున్నారు. అక్కడ రోడ్డు క్రాస్‌ చేయాలంటే భయంగా ఉంది.  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– సోము లత, మద్దిలపాలెం
సీపీ: సిబ్బందిని వెంటనే పంపించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తాం. ఈ జంక్షన్‌ వద్ద కానిస్టేబుల్‌ నియమిస్తాం. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న  వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. 

ఫిర్యాదు: ఆన్‌లైన్‌లో జాబ్‌ ఇస్తామని చెప్పి నా దగ్గర నుంచి కొంతమంది డబ్బులు కాజేశారు. 
–ఆదిబాబు, సింహాచలం
సీపీ: పూర్తి ఆధారాలతో మా కార్యాలయాన్ని సంప్రదించండి. న్యాయం జరిగేలా చూస్తాం.

ఫిర్యాదు: నా కుమార్తెను కొంత మంది హత్య చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. 
– ఎస్‌.శ్రీనివాస్, మధురవాడ
పోలీసు కమిషనర్‌: పూర్తి ఆధారాలతో సోమవారం నన్ను నేరుగా వచ్చి కలవండి. మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటా. 

ఫిర్యాదు: పెదగంట్యాడ ప్రాంతంలో భారీస్థాయిలో గుట్కా వ్యాపారం సాగుతోంది. గతంలో ఒకరిని అరెస్ట్‌ కూడా చేశారు. అయినా సరే వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీని వలన చుట్టు పక్క ప్రాంతాలు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 
– పేరు చెప్పడానికి ఇష్టపడ లేదు
సీపీ: మా సిబ్బందిని పంపించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదు: పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్‌లో సిగ్నల్‌ వ్యవస్థ బాగోలేదు. వెంటనే సిగ్నల్‌ వ్యవస్థను మెరుగుపరచాలి.
–లంబోధర్, పెందుర్తి
సీపీ: ట్రాఫిక్‌ అధికారులను పంపించి, సిగ్నల్‌ వ్యవస్థను మెరుగుపరుస్తాం.

ట్రాఫిక్‌ సమస్యకు స్వస్తి చెప్పండి: సిబ్బందిని ఆదేశించిన సీపీ
ఫోన్‌ ఇన్‌లో వచ్చిన కాల్స్‌లో ఎక్కువ శాతం ట్రాఫిక్‌ సమస్యలపైనే ఉండటంతో.. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ మీనా స్పష్టం చేశారు. ఫోన్‌ ఇన్‌ అనంతరం అక్కడ ఉన్న ట్రాఫిక్‌ అధికారులతో సీపీ మాట్లాడారు. ఎక్కువ కాల్స్‌ ట్రాఫిక్‌ పైనే ఉందని.. సమస్యను స్ట్రీమ్‌లైన్‌ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నెల రోజుల్లోగా ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలకు ఇప్పటి నుంచే ప్రారంభించాలని సీపీ ఆదేశించారు. ఫోన్‌ ఇన్‌లో భాగంగా సీపీకి వచ్చిన కొన్ని ఫిర్యాదులు ఇవి.. 

దొరికిన యువకుడు: సాక్షి ఫోన్‌ ఇన్‌ ఎఫెక్ట్‌..
ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధి రామ్‌నగర్‌ కప్పరాడ వద్ద నివాసముంటున్న మంగవేణి కుమారుడు నాగాల డిస్ని కుమార్‌ ఈ నెల  22న తప్పిపోయాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అతని ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శనివారం కంచరపాలెం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్‌ ఇన్‌లో ఆమె సీపీ ఆర్‌కే మీనాకు తమ సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన సీపీ ఆమె నుంచి కుమారుడి ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని, ఆ నంబర్‌ను ట్రాక్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే పోలీసులు రంగంలోకి సింహాచలంలో డిస్ని కుమార్‌ ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఉన్న స్థలానికి చేరుకుని.. యువకుడిని కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ను తీసుకువచ్చారు. అతన్ని తల్లి మంగవేణికి అప్పగించారు. సీపీకి ఫోన్‌ చేసిన కొద్ది గంటల్లోనే తన కుమారుడిని పట్టుకుని అప్పగించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top